ఆస్తి కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలో ఒకరి ప్రాణాలను బలయ్యాయి. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్గొండ : ఆస్తులకోసం తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి ఒకరి ప్రాణాలు పోయాయి. ఆస్తుల విషయం తెలేవరకు తన తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమంటూ సొంత బిడ్డలు బీష్మించుకు కూర్చున్నారు. దీంతో చనిపోయి మూడు రోజులు అవుతున్నా మృతదేహం హాస్పిటల్ మార్చురీలోనే అనాధ శవంలా పడివుంది. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన బైరు చెన్నయ్య, సైదులు అన్నదమ్ములు. వీరికి పెళ్లిళ్లయి పిల్లలు కూడా పెద్దవారయినా తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని మాత్రం పంచుకోలేదు. తండ్రి పేరిటవున్న నాలుగు ఎకరాల్లో చెరో రెండెకరాలు సాగు చేసుకుంటున్నారు.
అయితే తండ్రి మరణాంతరం వ్యవసాయ భూమి మొత్తం పెద్దకొడుకు చెన్నయ్య పేరుపైకి మారింది. దీంతో అన్నదమ్ములు కుటుంబాల మధ్య భూమి కోసం గొడవలు ప్రారంభమయ్యాయి. తన వాటా రెండెకరాలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని అన్న చెన్నయ్యను తమ్ముడు సైదులు కోరుతున్నాడు. అందుకు అన్న అంగీకరించకపోవడంతో న్యాయం కోసం తమ్ముడు కోర్టును ఆశ్రయించాడు.
Read More మహబూబాబాద్ లో విషాదం... లోన్ యాప్ వేధింపులకు నిరుపేద స్టూడెంట్ బలి
మూడురోజుల క్రితం భూమి విషయంలో చెన్నయ్య, సైదులు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అన్నతో పాటు అతడి కుటుంబసభ్యులు దాడిచేయడంతో సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం నల్గొండకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే చనిపోయాడు.
సైదులు చనిపోయి మూడురోజుల అవుతున్నా ఇప్పటివరకూ దహనసంస్కారాలు నిర్వహించలేదు. వారసత్వంగా తమకు దక్కాల్సిన భూమిని పెదనాన్న కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని సైదులు బిడ్డలు బీష్మించుకు కూర్చున్నారు. దీంతో సైదులు మృతదేహం హాస్పిటల్ మార్చురులోనే వుండిపోయింది.
మృతుడు సైదులు కూతుళ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడి మృతికి కారణమై చెన్నయ్యతో పాటు అతడి కొడుకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సాయంతో సైదులు అంత్యక్రియలు నిర్వహించేలా అతడి కుటుంబాన్ని ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
