తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. బిసి రిజర్వేషన్ పెంపుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో త్వరలోనే తెలంగాణ గ్రామాల్లో పంచాయితీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.
Telangana BC Reservations : తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంతకాలం పెండింగ్ లో పెట్టిన ఈ రిజర్వేషన్ బిల్లుకు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పూర్తిస్థాయి ఆమోదం లభించింది... గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి తెలిపారు. బిసి రిజర్వేషన్లకు ఆమోదం లభించడంతో తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్
తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది... ఇందుకోసం తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 285A ని సవరించడానికి ఓ ముసాయిదా ఆర్డినెన్స్ ను రూపొందించింది. అయితే దీనికి గవర్నర్ ఆమోదం అవసరంకాగా ఇంతకాలం తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి.
బిసిలకు 42శాతం రిజర్వేషన్లు
బిసిలకు స్థానిక పాలనలో మరింత ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు... ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించి పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో పంచాయితీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. మరి సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు సెప్టెంబర్ లోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తారా? మరింత సమయం తీసుకుంటారా? అన్నది త్వరలోనే తేలనుంది.
