జహీరాబాద్ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం: నాలుగు పరీక్షలు పూర్తైన విద్యార్ధులకు అందని టెన్త్ హల్ టిక్కెట్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రైవేట్ స్కూల్ లో టెన్త్ క్లాస్ విద్యార్ధులకు హల్ టిక్కెట్లు అందలేదు. దీంతో విద్యార్ధులు పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో గల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్వాకంతో ఎనిమిది మంది విద్యార్ధులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాయలేకపోయారు. టెన్త్ క్లాస్ కు అనుమతి లేకున్నా ఎనిమిది మంది విద్యార్దులకు ప్రైవేట్ స్కూల్ లో ఆడ్మిషన్ ఇచ్చారు. టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైనా కూడా ఈ ఎనిమిది మంది విద్యార్ధులకు హల్ టిక్కెట్లు అందలేదు. ఇప్పటికే నాలుగు పరీక్షలు పూర్తైనా కూడా ఎనిమిది మంది విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు రాలేదు. దీంతో ఎనిమిది మంది విద్యార్ధులు ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే టెన్త్ క్లాస్ కు చెందిన తెలుగు , హిందీ, ఇంగ్లీష్, గణితం పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా కూడా విద్యార్ధులను స్కూల్ యాజమాన్యం మభ్యపెడుతుందని బాధితుల పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ స్కూల్ లో టెన్త్ క్లాస్ కు అనుమతి లేకున్నా ఎనిమిది మంది విద్యార్ధులను చేర్చుకున్నారని బాధిత పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్ధులు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని విద్యాశాఖ అధికారులు చేతులెత్తేశారు. ఎనిమిది మంది విద్యార్ధులు ఒక్క ఏడాదిని నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.