హైదరాబాద్: ప్లాస్టిక్ నిషేధం విషయంలో మీతో నేను ఏకీభవించనని తెలంగాణ మంత్రి కెటి రామారావుకు నటి ఈషా రెబ్బ బదులిచ్చారు. ట్విటర్ లో తనకు వచ్చే ప్రశ్నలకు వెంటనే స్పందించే కేటీఆర్ తాజాగా నటి ఈషా రెబ్బ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. 

ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈషా ప్రస్తావిస్తూ కేటీఆర్‌కు ట్వీట్‌ చేసింది. పలు అంశాల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందని, కానీ ప్లాస్టిక్‌ నిషేధిత రాష్ట్రాల్లో తెలంగాణ పేరు లేకపోవడం నిరాశ కలిగిస్తోందని ఆమె ట్వీట్ చేసింది. దానికి కేటీఆర్ వెంటనే స్పందించారు.
 
చట్టప్రకారం నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్లాస్టిక్‌ నిషేధం జరగదని, నిషేధం పక్కాగా అమలు కావాలంటే అధికారులు, తయారీదారులు, ప్రజలకు సమస్య తీవ్రత గురించి అవగాహన కలగాలని ఆయన అన్నారు. దీన్ని ఓ పద్ధతి ప్రకారం అమలుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 

కేటీఆర్ సమాధానానికి ఈషా బదులిచ్చారు. మీ వాదనతో తాను ఏకీభవించలేనని అంటూ మీలాంటి సమర్థుడైన యువ నాయకుడు ఉండగా ప్లాస్టిక్‌ నిషేధం అసాధ్యమని నేను అనుకోను. ప్లాస్టిక్‌ నిషేధంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపాలని అన్నారు.