క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను హవాలా లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాలలో నిర్వహించిన క్యాసినో ఈవెంట్లకు చీకోటి ప్రవీణ్.. కొందురు రాజకీయ నాయకులు, వారి బంధువులను కూడా తీసుకెళ్లినట్టుగా ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. 

క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను హవాలా లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాలలో నిర్వహించిన క్యాసినో ఈవెంట్లకు చీకోటి ప్రవీణ్.. కొందురు రాజకీయ నాయకులు, వారి బంధువులను కూడా తీసుకెళ్లినట్టుగా ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డిలపై Foreign Exchange Management Act కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. చికోటీ వాట్సాప్ చాటింగ్, హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. 

ఇప్పటికే ప్రవీణ్ వాట్సాప్ డేటాను రిట్రీవ్ చేసిన ఈడీ అధికారులు.. పలువురు ప్రజా ప్రతినిధులతో ఆయన చాటింగ్ వివరాలును గుర్తించినట్టుగా తెలుస్తోంది. నలుగురు ప్రజాప్రతినిధులకు(ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు) ఈడీ నోటీసులు ఇవ్వనుందని.. సోమవారం విచారణకు పిలవనుందనే ప్రచారం సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికి సమాచారం మాత్రం రావాల్సి ఉంది. 

మరోవైపు చీకోటి ప్రవీణ్‌తో పరిచయం ఉన్న ప్రజాప్రతినిధులు చిట్టా భారీగానే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీవీ న్యూస్ చానల్ ప్రసారం చేసిన కథనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది వీఐపీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్టుగా తెలిపింది. అందులో హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు , హైదరాబాద్‌లో తొలిసారిగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి, మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుగా పేర్కొంది.

వీరంతా చికోటీ నిర్వహించిన క్యాసినోకు వెళ్లారని.. ఈడీ అధికారులు వీరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చీకోటి ప్రవీణ్.. పలువురు ప్రముఖులతో ఉన్న ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఈ కేసుకు సంబంధించి ఒకవేళ ప్రజాప్రతినిధులకు ఈడీ విచారణకు పిలిస్తే.. పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. రాజకీయంగా కీలక సమీకరణాలు చోటుచేసుకున్న అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ కేసులో ఈడీ తదుపరి ఎలాంటి అడుగులు వేస్తుందని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చీకోటితో పరిచయాలు ఉన్న ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.