ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్ అయ్యింది. స్వప్నను డిస్మస్ చేసేందుకు కలెక్టర్‌కు విచక్షణాధికారం ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్ అయ్యింది. స్వప్నను డిస్మస్ చేసేందుకు కలెక్టర్‌కు విచక్షణాధికారం ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. అలాగే స్వప్నకు ఐపీసీ 171 డీ, 418 సెక్షన్ల కింద రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా వుంది.
అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాటికొండ స్వప్నను వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్, సీపీఎం, జనసమితి పార్టీ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఓటు రిజెక్ట్ అయ్యిందని చెప్పినప్పటికీ తోటికోడలు పేరుతో వున్న ఓటును స్వప్న వేశారని వారు ఆరోపించారు. ఆ ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు సమర్పించి ఫిర్యాదు చేశామని కౌన్సిలర్లు వెల్లడించారు. దొంగ ఓటును వేసిన స్వప్నను వెంటనే ఛైర్మన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్లో వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ స్వప్న ఓటు వేసేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 283 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
అయితే ఓటరు జాబితాలో తన పేరు లేకున్నా ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నా పేరు మీదే ఓటు వేశానని.. ఇదివరకే ఓటరు జాబితాలో తన పేరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నానని అధ్యక్షురాలు తాటికొండ స్వప్న తెలిపారు.
ఆధార్ కార్డుతో ఓటు వేయడానికి వెళ్లానని అక్కడ అధికారులు అన్ని చూశాకే తనకు ఓటు వేయడానికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఇతర పార్టీల ఏజెంట్లు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. కాంగ్రెస్ నాయకులు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇతరుల ఓటు వేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె పేర్కొన్నారు.
