హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. నిన్న హుజూర్ నగర్ లోని తెరాస అభ్యర్థి సైది రెడ్డి మిత్రుడి స్కూల్ లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. సైది రెడ్డి ఆప్త మిత్రుడైన  రవికుమార్ నిర్వహిస్తున్న పాఠశాలలో నిన్న సోదాలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

డిసెంబర్ లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా సైది రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఈ స్కూల్ ఏ కేంద్రబిందువుగా ఉండేది. ఈ సరి కూడా పూర్తి వ్యవహారాలన్నీ కూడా ఇక్కడి నుండే నడుపుతున్నారు. ప్రచార బాధ్యతలు తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఈ పాఠశాలకు పలుమార్లు వచ్చి వెళ్లారు. 

ఈ స్కూల్ కేంద్ర బిందువుగా డబ్బు పంపిణీ జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు నిగ్గు తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో సోదాలను అధికారులు మొదలుపెట్టారు. 

సోదాలు నిర్వహించిన అధికారులకు డబ్బు ఏమీ దొరకలేదని, కాకపోతే ఒక హార్డ్ డిస్క్ ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ హార్డ్ డిస్కులో పూర్తి ప్రచార నిర్వహణ ఖర్చుల చిట్టా ఉండి ఉందనే అనుమానంతోని అధికారులు ఈ హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారని ఊహాగానాలు వినపడుతున్నాయి. 

ఈసీఇంతకుమునుపు కూడా గట్టి షాకులనే ఇచ్చింది. ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకుడు డేగ కన్నుతో తెరాస పార్టీ నాయకుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నాడట. అధికార పార్టీకి సానుకూలంగా ఉండే ఏ అంశాన్నైనా వదలడంలేదట. దీనిపైన తెరాస నేతలు తెగ మదనపడిపోతున్నారు. 

ఎన్నికల వేళ అన్ని పంపిణీల్లోకెల్లా ముఖ్యమైన మద్యం పంపిణీని తెరాస చేయలేకపోతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈసీ నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తూ కఠినంగా వ్యవహరిస్తుందని తెరాస నేతలు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. 

ఈ వ్యవహారంలో ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్ పై ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు అందింది. అధికార తెరాస కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని అతని పై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారం జరిపమని ఎక్సయిజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. 

ఎన్నికల సంఘం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సయిజ్ శాఖ శ్రీనివాస్ ను అక్కడి నుంచి తప్పించి నల్గొండ హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేసారు. తదుపరి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ఎక్సయిజ్ శాఖ. 

కొన్ని రోజుల కిందటే సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార తెరాస కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని తప్పించి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసారు. 

ఈసీ తీసుకుంటున్న ఇలాంటి కఠిన నిర్ణయాలు తెరాస నేతలకు కంటగింపుగా మరయంటున్నారు. ఒక షాక్ తరువాత మరొకటి ఇలా వరుసగా తగులుతూ ఉండడంతో ఎటు పాలుపోని స్థితిలో తెరాస నేతలు ఉండిపోయారు. నేటితో ప్రచారం కూడా ముగియనుంది. సాయంత్రం నుండి తెర వెనుక కార్యక్రమాలకు తెర తీసేందుకు ప్రయత్నించాలంటేనే తెరాస శ్రేణులు భయపడుతున్నారట. ప్రచార సమయంలోనే ఇంత కఠినంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంటే, ప్రచారం ముగిశాక మరింత చుక్కలు చూపెడుతుందని వారు ఒకింత కలవర పడుతున్నారు.