హుజూర్ నగర్:   హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయవాతావరణం మంచి కాక మీదుంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్ర అగ్ర రాజకీయనేతలంతా హుజూర్ నగర్ లో తిష్ఠ  వేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తులు వాటికి పైఎత్తులు వేయడంలో తలమునకలైయున్నారు. 

కాంగ్రెస్ ఎలాగైనా తన సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని పట్టుదలగా ఉంటే, ఎలాగైనా కాంగ్రెస్ ని వారి సొంత సీట్లోనే ఓడించి విమర్శకుల నోర్లు మూయించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. మరోపక్క తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఎన్నికకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే గడువుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండే చోట గెలుపోటములను నిర్ణయించేది పోల్ మానేజ్మెంట్ . ఇలా ఆఖరు నిమిషంలో పోల్ మానేజ్మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో కెసిఆర్ సిద్దహస్తుడానే ప్రచారం ఉంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించడంలో కెసిఆర్ మహా సమర్థుడు. 

ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గం కూడా ఇదే కోవలోకి వచ్చే ఒక నియోజకవర్గం. అన్ని పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా పోరాడుతున్నాయి. కెసిఆర్ ఎత్తులు ఇక్కడ మాత్రం పారేలా కనపడడం లేదు.ఈసీ కఠిన నిఘా  అధికార తెరాసకు గొంతులో పచ్చివెలక్కాయలా తయారయ్యింది. 

ఈసీ నియమించిన ప్రత్యేక పరిశీలకుడు డేగ కన్నుతో తెరాస పార్టీ నాయకుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నాడట. అధికార పార్టీకి సానుకూలంగా ఉండే ఏ అంశాన్నైనా వదలడంలేదట. దీనిపైన తెరాస నేతలు తెగ మదనపడిపోతున్నారు. 

ఎన్నికల డేట్ సమీపిస్తున్నకొద్దీ పార్టీలు ప్రచార వ్యూహాలకన్నా డేట్ వాల్యూ వ్యూహాన్ని ఖచ్చితంగా అమలుచేయడానికి ప్రాధాన్యతను ఇస్తుంటాయి. తెరాస ఇప్పుడు తాను అనుకున్న సదరు వ్యూహాలను ఈసీ నిఘా కారణంగా అమలుచేయలేకపోతుందట. ఎన్నికల వేళ అన్ని పంపిణీల్లోకెల్లా ముఖ్యమైన మద్యం పంపిణీని తెరాస చేయలేకపోతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈసీ నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తూ కఠినంగా వ్యవహరిస్తుందని తెరాస నేతలు తెగ ఇబ్బంది పడిపోతున్నారట. 

ఈ వ్యవహారంలో ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్ పై ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు అందింది. అధికార తెరాస కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని అతని పై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారం జరిపమని ఎక్సయిజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. 

ఎన్నికల సంఘం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సయిజ్ శాఖ శ్రీనివాస్ ను అక్కడి నుంచి తప్పించి నల్గొండ హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేసారు. తదుపరి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ఎక్సయిజ్ శాఖ. 

కొన్ని రోజుల కిందటే సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార తెరాస కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని తప్పించి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసారు. 

ఈసీ తీసుకుంటున్న ఇలాంటి కఠిన నిర్ణయాలు తెరాస నేతలకు కంటగింపుగా మరయంటున్నారు. ఒక షాక్ తరువాత మరొకటి ఇలా వరుసగా తగులుతూ ఉండడంతో ఎటు పాలుపోని స్థితిలో తెరాస నేతలు ఉండిపోయారు. ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అత్యంత కీలకమైన పోల్ మానేజ్మెంట్ ను పకడ్బందీగా చేసేందుకు ప్లాన్ చేసుకున్న తెరాస ఇప్పుడు ఆ ప్లాన్లను అమలుచేయలేకపోతుంది.