తెలంగాణలో మూడు విడతలుగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పటికే ఎన్నికయి, గ్రామ సర్పంచ్‌ హోదాలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలనుకున్న నూతన సర్పంచ్‌లకు ఈసీ షాకిచ్చింది. కొత్తగా ఎన్నికయిన సర్పంచ్ లు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు కాబట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వరాదని ఈసీ అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లతో పాటు మండల స్థాయి అధికారులకు ఆదేశిస్తూ జీవో జారీ చేసింది. 

ఈ నెల 30వ తేదీన జరిగే మూడవ విడత ఎన్నికల ద్వారా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ముగియనుంది. ఆ తర్వాత మూడు విడతల్లో ఎన్నికయిన కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒకేరోజు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అప్పటివరకు గ్రామ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోనే వుంటుందని స్పష్టం చేసింది. 

అందువల్ల గ్రామాల్లో ప్రభుత్వ ఆద్వర్యంలో జరిగే గణతంత్ర వేడుకల్లో నూతన సర్పంచ్ లను ప్రత్యేకంగా ఆహ్వానించరాదని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా వేదికపైకి  ఆహ్వానించడం, బహుమతులను వారి చేతుల మీదుల అందించడం, జాతీయ పతాకాన్ని ఆయన చేత ఆవిష్కరింపజేయడం వంటివి చేయరాదని అధికారులను సూచించింది.  

గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారే జాతీయ జెండా ఎగరవేయల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.