Huzurabad Bypoll: మళ్ళీ దగాపడ్డ దళితులు... సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్ డిమాండ్
దళిత బంధు పథకం పేరిట మరోసారి దళితులను దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేసారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఎలాగూ దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తారని సీఎం కేసీఆర్ కు తెలుసని... ఆయన వైఫల్యం వల్లే దళిత బంధు అందడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. దళితబంధు పథకాన్ని నిలిపివేయించి... దాన్ని ఇతరులపై నెట్టాలని కేసీఆర్ ముందుగానే కుట్ర చేసారన్నారు. తాము కేవలం దళిత బంధు కింద అర్హుల బ్యాంకు ఖాతాలో పడిన డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఈసీకి, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చామని Bandi Sanjay వివరించారు.
''CM KCR వైఫల్యం వల్లే "Dalit Bandhu" పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయకుండా ఆపారు'' అని ట్విట్టర్ వేదికన సంజయ్ ఆరోపించారు.
''దళితులను కేసీఆర్ మొదటి నుండి మోసం చేస్తూనే ఉన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీలు గాలికొదిలేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా దళిత బంధు స్కీంను నిలిపివేసి మరోసారి దగా చేశారు'' అన్నారు.
READ MORE కొంపదీసి ఆ బాగోతంలో మీరూ భాగస్వాములేనా?: కేటీఆర్ కు రేవంత్ ట్వీట్
''తన కపట బుద్ది, నాటకాలతో దళితుల పొట్ట కొడుతున్న కేసీఆర్ కు దళితుల ఉసురు తగులుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దళితులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం'' అని బండి సంజయ్ హెచ్చరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని తాజాగా ఈసీ నిర్ణయం తీసుకొంది. దళితబంధు పథకం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపించడమే కాదు కొందరు ఈసీతో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో పాటు హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారికి కూడ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోయల్ సోమవారం ఆదేశించారు. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని ఈసీ సూచించింది.
దళితబంధు పథకాన్నిహుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి ఎలక్షన్ కమీషన్ కు ఈ పథకం ఫిర్యాదులు అందాయి. ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందంటూ ఫిర్యాదులు అందడంలో ఈసీ ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
READ MORE దళితబంధు: నాలుగు మండలాలకు రూ. 250 కోట్ల నిధులు విడుదల
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు దళితులతో పాటు బీసీ, ఈబీసీలకు కూడా ఇదే తరహాలో పథకాన్ని అమలు చేస్తామని నిన్న సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు.
ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో హుజురాబాద్ అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నాయి. వచ్చే నెల నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగడానికి 12 రోజుల ముందు ఈ పథకానికి బ్రేక్ వేసింది ఈసీ.