దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి  ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు ప్రకటించింది.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి  ఈ ఏడాది ఆగష్టు 5వ తేదీన అనారోగ్యంతో మరణించాడు.సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ స్థానానికి అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 16వ తేదీ చివరగా నిర్ణయించారు.నామినేషన్ల స్క్యూట్నీని అక్టోబర్ 17న నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహారణకు అక్టోబర్ 19 చివరి తేదీ.

నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేస్తారు. నవంబర్ 12వ తేదీ లోపుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణిని ఈ స్థానం నుండి బరిలోకి దింపే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడ ఈ స్థానం నుండి పోటీ చేయనున్నాయి. బీజేపీ నుండి రఘునందన్ రావు పోటీకి సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్ధి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.

తెలంగాణలోని దుబ్బాకతో పాటు దేశంలోని 56 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక్క స్థానానికి, గుజరాత్ లో ఎనిమిది, హర్యానాలో ఒక్కస్థానానికి, జార్ఖండ్ , కర్ణాటక రాష్ట్రాల్లో రెండేసి స్థానాలకు అదే రోజున ఎన్నికలు నిర్వహిస్తారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 28 స్థానాలకు , మణిపూర్ లో రెండు, నాగాలాండ్ లలో రెండు, ఒడిశాలో ఒక్కటి, యూపీలో 7 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.