Asianet News TeluguAsianet News Telugu

భార్య, భర్త, కుమారుడు.. ఓ మాయదారి ఫ్యామిలీ: రూ.1000 కోట్లు దోచేశారు

భార్య, భర్త, కుమారుడు కలిసి జనానికి రూ.1000 కోట్లు కుచ్చు టోపీ పెట్టారు. పేదవారుగా పుట్టడం మీ తప్పు కాదు.. కానీ పేదవారుగా చావడం అతిపెద్ద నేరం’’ అంటూ జనాన్ని రెచ్చగొట్టి ఉచ్చులోకి దించుతూ కోట్లకు కోట్లు కొల్లగొట్టింది ఈ మాయదారి ఫ్యామిలీ

eBIZ Scam: Police Busted Multi-level Marketing Fraud
Author
Hyderabad, First Published Mar 13, 2019, 8:35 AM IST

భార్య, భర్త, కుమారుడు కలిసి జనానికి రూ.1000 కోట్లు కుచ్చు టోపీ పెట్టారు. పేదవారుగా పుట్టడం మీ తప్పు కాదు.. కానీ పేదవారుగా చావడం అతిపెద్ద నేరం’’ అంటూ జనాన్ని రెచ్చగొట్టి ఉచ్చులోకి దించుతూ కోట్లకు కోట్లు కొల్లగొట్టింది ఈ మాయదారి ఫ్యామిలీ.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిదా కేంద్రంగా ఈబిజ్ పేరుతో సాగిన మోసం వెలుగుచూసింది. 2001లో నోయిడా కేంద్రంగా పవన్ మల్హాన్ ఈబిజ్ కంపెనీ తెరిచాడు. ఇతను ఎండీగా, భార్య అనిత డైరెక్టర్‌గా, కుమారుడు హితిక కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు.

మధ్య తరగతి వారిని టార్గెట్ చేసుకుని ఎంపిక చేసుకున్న వేదికల్లో సమావేశాలు నిర్వహించేవారు. ధనవంతులు కావాలని ఉందా..? సులభంగా డబ్బు సంపాదించాలని ఉందా..? అని చెబుతారు. మిమ్మిల్ని కుబేరులుగా మారుస్తామని అయితే అందుకు రుసుము కింద రూ.16,821 కట్టించుకుంటారు.

ఒకసారి సభ్యులుగా చేరిన వారు మరో ఇద్దరిని కంపెనీలో సభ్యులుగా చేర్పించాలి. వారు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్‌గా రూ.2,700 వస్తుందని చెబుతారు. కింద సభ్యులుగా చేరిన వారు సభ్యులను చేర్చుకుంటూ పోతే.. కమిషన్ కూడా పెరుగుతుందని నమ్మించారు.

సభ్యుడిగా చేరిన వ్యక్తి మొదట రిప్రజెంటేటివ్‌ ఆ తర్వాత సిల్వర్, డైమండ్, డిప్లొమాట్, సిల్వర్ డిప్లొమాట్, గోల్డ్ డిప్లొమాట్, డైమండ్ డిప్లొమాట్, అంబాసడర్, సిల్వర్ అంబాసడర్, గోల్డ్ అంబాసడర్, డైమండ్ అంబాసడర్, చైర్మన్ సర్కిల్‌కు చేరుకుంటారని చెప్పారు.

డబ్బులు చెల్లించినందుకు ప్రతిఫలంగా బట్టలు, ఈ లెర్నింగ్ పేరిట ఆన్‌లైన్ కోర్సుల నిమిత్తం లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. వాటితో లాభమేమీ లేకున్నా సభ్యులుగా చేరితే సంపాదన లక్షలు, కోట్లు దాటుతుందన్న ఆశతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు.

అలా 18 సంవత్సరాల్లో 7 లక్షల మంది నుంచి రూ.1000 కోట్లు వసూలు చేశారు. ఇది నిజమేనని నమ్మిన విద్యార్ధులు, నిరుద్యోగులు, మహిళలతో పాటు వివిధ రంగాలకు చెందిన లక్షల మంది ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

అయితే జగిత్యాల మండలం మహాలక్ష్మీనగర్‌కు చెందిన సామల వివేక్‌కు తెలిసిన వారు చెప్పడంతో రూ.16821 చెల్లించి సభ్యత్వం తీసుకున్నాడు. మరికొంతమందిని సభ్యులుగా చేర్చితే వారిచ్చే కమీషన్‌ ద్వారా రాబడి ఉంటుందని ప్రతినిధఉలు చెప్పడంతో తన వంతుగా 8 మందిని చేర్చాడు.

అయినా ఎలాంటి సంపాదన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే ఈ నెల 5న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ఉన్న పవన్, అనిత, అతని కుమారుడు హితిక్‌ను అరెస్ట్ చేశారు.

బ్యాంకుల సహకారంతో ఈబిజ్‌కు చెందిన రూ.70.5 కోట్ల డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. ఈ కంపెనీ మోసాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవాలోనూ కేసులు నమోదైనట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios