పార్టీ మారబోతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పెరిగిన జోష్, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ పై వ్యతిరేకత నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారనున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల డిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ఈటలను పిలుచుకుని కేంద్ర మంత్రి అమిత్ షా భేటీకావడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. వీరు పార్టీ మారే ఆలోచనలో వున్నందుకే అమిత్ షా బుజ్జగించే ప్రయత్నం చేసారని ప్రచారం జరుగుతోంది. అయితే బిజెపిని వీడే ఆలోచనేది తనకు లేదని... తాను పూటకో పార్టీ మార్చేరకం కాదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు.
తాజాగా మరోసారి పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఈటల స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనలాంటి వారిని పదేపదే పార్టీమార్పుపై ప్రశ్నించవద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు ఈటల. పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని అన్నారు. తాను బిజెపిలోనే కొనసాగుతానని ఈటల స్పష్టం చేసారు.
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాసంస్థల ద్వారా హైప్ క్రియెట్ చేసుకుందని... ఇలాంటి ప్రచారాలతో పార్టీ పెరగదని ఈటల అన్నారు. తొందరగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆత్రుతతో ఉన్నట్టుందని అన్నారు.
Read More జాగ్రత్తగా మాట్లాడాలి: జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వున్నమాట వాస్తమేనని ఈటల అన్నారు. ఈ వ్యతిరేకతను ఎవరు సొమ్ముచేసుకుంటారో చూడాలన్నారు. ఒక్కటి మాత్రం నిజం... ప్రజలు బిఆర్ఎస్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో నమ్మబోరని ఈటల అన్నారు.
వీడియో
పోరాడి తెలంగాణను సాధించుకున్నది అభివృద్ధి కోసమే కాదు అత్మగౌరవం కోసం కూడా అని ఈటల అన్నారు. కానీ ప్రజలకు కాదు సొంత ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే భాగ్యం లేదన్నారు. నిధులు, రోడ్లు, అభివృద్ది కాదు మాకు కావాల్సింది గౌరవమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతున్నారని ఈటల అన్నారు.
ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్టులు వున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేసారు. అందువల్లే ఏ పార్టీలో ఏం జరుగుతుందో కేసీఆర్ కు ముందుగానే తెలిసిపోతోందని అన్నారు. ఏం చేసినా తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు మళ్ళీ అధికారం అప్పగించేందుకు సిద్దంగా లేరని ఈటల అన్నారు.
