గజ్వెల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు సెంటిమెంట్స్ ఎక్కువ. జ్యోతిషంపై లేదా సంఖ్యాశాస్త్రంపై ఆయనకు ఎనలేని విశ్వాసం. ప్రతి పనీ ముహూర్తం చూసుకునే చేస్తారు. బయటకు వెళ్తే దట్టీ కట్టుకుంటారు. 

అయితే, గజ్వెల్ విషయానికి వస్తే సెంటిమెంట్ గెలుస్తుందా, కేసిఆర్ గెలుస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. మొదటి సెంటిమెంట్ విషయానికి వస్తే.. గజ్వెల్ లో ఒక్కసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలువలేదు. 1978 నుంచి ఇదే పరిస్థితి. 1978లో సైదయ్య అల్లం సాయిలుపై విజయం సాధించారు. 1983 ఎన్నికలకు వస్తే సాయిలు సైదయ్యపై విజయం సాధించారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెసు సీనియర్ నేత జె. గీతారెడ్డికి కూడా ఓటమి తప్పలేదు.

2009లో తూముకుంట నర్సారెడ్డి గజ్వెల్ లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో నర్సారెడ్డి ఓడిపోయి కేసీఆర్ విజయం సాధించారు. అయితే, కేసీఆర్ సమీప అభ్యర్థి మాత్రం వంటేరు ప్రతాపరెడ్డి. ఇప్పుడు వంటేరు ప్రతాపరెడ్డి కేసిఆర్ మీద పోటీ చేస్తున్నారు. నర్సారెడ్డి వంటేరు ప్రతాపరెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇలా చూస్తే కేసీఆర్ పరిస్థితి ఏమవుతుందనే ఉత్కంఠ నెలకొంది.

రెండో సెంట్ మెంట్ విషయానికి వస్తే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 2003లో శాసనసభను ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ మార్చి వరకు సమయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుపై ఓడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ముందస్తు ఎన్నికలు పాలక పార్టీకి కలిసి రావడం లేదనే సెంటిమెంట్ ఉంది. దీన్ని కేసీఆర్ అధిగమిస్తారా అనేది చూడాల్సి ఉంది. 

సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన సెంటి మెంట్ విషయానికి వస్తే, కేసిఆర్ లక్కీ నెంబర్ ఆరు. తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆయన శాసనసభను సెప్టెంబర్ 6వ తేదీన రద్దు చేశారు. నవంబర్ 24వ తేదీన గానీ డిసెంబర్ 6వ తేదీన గానీ పోలింగ్ జరుగుతుందని, అది కలిసి వస్తుందని కేసిఆర్ భావించారు. అయితే, ఆయన ఆశలకు విరుద్ధంగా డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఏ మేరకు కేసీఆర్ లేదా టీఆర్ఎస్ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనే చూడాల్సే ఉంది. 

జ్యోతిష శాస్త్రం విషయానికి వస్తే, శాసనసభ రద్దు దృక్ గణితం నియమాల ప్రకారం జరగలేదని, ఇది కేసీఆర్ కు కలిసి వచ్చేది కాదని సోమశేఖర శర్మ వంటి జోతిష్య పండితులు అంటున్నారు. మొత్తం మీద, సెంటిమెంట్ కు సంబంధించిన చర్చ విస్తృతంగానే జరుగుతోంది.