Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల విద్యార్థి ఫిర్యాదుతో గుట్టు రట్టు: ఈ బిజ్ ఎండీ, ఆయన కుమారుడు అరెస్టు

గొలుసుకట్టు మోసానికి పాల్పడ్డారనే ఆరోపణపై సైబరాబాద్ పోలీసులు ఈ బిజ్ ఎండీ పవన్ మల్హన్ ను, ఆయన కుమారుడు హితిక్ మల్హన్ ను అరెస్టు చేశారు. జగిత్యాల విద్యార్థి ఫిర్యాదుతో ఆ గొలుసుకట్టు మోసం వెలుగు చూసింది.

E Biz MD Pavan Malhan arrested
Author
Hyderabad, First Published Aug 21, 2019, 6:34 AM IST

హైదరాబాద్: విద్యార్థులు లక్ష్యంగా గొలుసుకట్టు మోసానికి పాల్పడ్డారనే ఆరోపణపై సైబరాబాద్ పోలీసులు ఈ బిజ్ ఎండీ పవన్ మల్హన్ ను, ఆయన కుమారుడు హితిక్ మల్హన్ ను అరెస్టు చేశారు. జగిత్యాల విద్యార్థి ఫిర్యాదుతో ఆ గొలుసుకట్టు మోసం వెలుగు చూసింది. ఈ బిజ్ మోసంపై హైదరాబాద్ లోని కెపిహెచ్ బీ, మాదాపూర్ పోలీసు స్టేషన్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశవ్యాప్తంగా గొలుసుకట్టు విధానం ద్వారా ఈ బిజ్ రూ. 5 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. 

పవన్, హితిక్ లను ఢిల్లీలో అరెస్టు చేసి హైదరాబాదు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వారిని చర్లపల్లి జైలుకు పంపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మినగర్ కుచెందిన సామల్ల వివేక్ హైదరాబాదు లోని కుందన్ బాగ్ లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ ప్రమోటర్ ద్వారా అతన్ని ఈ బిజ్ సంస్థలో చేర్పించాడు. 

రెండు నెలలైనా తన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో వివేక్ తనను చేర్పించిన వ్యక్తిని నిలదీశాడు. మరికొంత మందిని చేర్పిస్తేనే కమిషన్ వస్తుందని ఆ ప్రమోటర్ చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు భావించిన వివేక్ సైబరాబాద్ ఆర్థిక నేరాల విభంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హర్యానాలోని నోయిడా సెక్టార్ 63లో ఈ బిజ్ సంస్థ కార్యాలయం 2001లో ప్రారంభమైంది. అదే ప్రాంతానికి చెందిన మల్హాన్ ఎండీగా, అతని భార్య అనిత మల్హాన్ డైరెక్టర్ గా కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో నమోదైంది. వీరి కుమారుడు హిత్క్ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తున్నాడు. విద్యార్థులను, నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని ప్రమోటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నెలలో పెట్టుబడి సొమ్ము తిరిగి పొందవచ్చునని ఆశ పెడుతూ వచ్చారు. 

అయితే, నెల రోజులైనా తమ డబ్బు తిరిగి రాకపోవడంతో సభ్యులుగా చేరినవారు ప్రమోటర్లను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. మరో ముగ్గురిని చేర్పిస్తే తప్ప డబ్బులు వెనక్కి రావని చెబుతూ వచ్చారు. ఆ విధంగా సంస్థ ప్రతినిదులు హైదాబాదు, బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నగరాల్లోనే కాకుండా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకట, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు 

Follow Us:
Download App:
  • android
  • ios