హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు మరికొద్ది రోజుల్లో పరిష్కారం దొరకనుంది. హైదరాబాద్‌ ఐకానిక్‌ ప్రాంతంగా అభివృద్ధి చేస్తోన్న కేబుల్‌ వంతెన మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన, రోడ్‌ నెంబర్‌-45లోని ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభిస్తారని సమాచారం. 

రూ. 184 కోట్లతో నిర్మించిన వంతెన పనులు రెండు నెలల క్రితమే పూర్తయ్యాయి. ఎలక్ర్టిఫికేషన్‌, వంతెనపై వీధి దీపాల ఏర్పాటులో జాప్యంతో ఇన్నాళ్లూ ప్రారంభోత్సవం జరగలేదు. తాజాగా చైనా నుంచి తీసుకువచ్చిన దీపాలను వంతెన ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేశారు. స్తంభాలు లేకుండా ఫుట్‌పాత్‌పై వీధి దీపాలు ఏర్పాటు చేయడం నగరంలో ఇదే ప్రథమం.

ఇదిలా ఉండగా.. ఈ తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యింది.  చెరువుకు ఇరు వైపులా ఉన్న ప్రాంతాలను కలుపుతూ దూరాన్ని దగ్గర చేస్తోంది. ఎత్తైన గుట్టల మధ్య సాగే ఈ నిర్మాణం నగరానికి మరింత అందాన్ని తీసుకువస్తుందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.184కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్ల కింద మొదలైన పనులు ఇటీవల పూర్తయ్యాయి. విద్యుద్దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. 

దీని పొడవు 754.83 మీటర్లు. ఆరులైన్ల వెడల్పు రోడ్డు మార్గం ఉంది. ఇరువైపులా ఆకట్టుకునే కాలిబాట, ఉక్కు రెయిలింగ్, విద్యుద్దీపాలు నిర్మాణానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.