దుబ్బాక ఉప ఎన్నిక ఒకరి ప్రాణాలు తీసింది. టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. 

కాల్వశ్రీరాంపూర్‌ సింగిల్‌ విండో డైరెక్టర్‌ పులి సత్యనారాయణరెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ను  పార్టీ నాయకులతో కలిసి చూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఆయనలో అలజడిని సృష్టించాయి.

సాయంత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత ఓడిపోయిందని ప్రకటించడంతో తీవ్రకలత చెందారు. ఇక బీజేపీ వారు హుషారై బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారంటూ అక్కడే ఉన్న సహచరులకు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 

వెంటనే అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.