తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ కార్మదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. నాలుగు లైన్ల పరీక్ష రాయడం రాని ఎర్రబెల్లి పంచాయతీ కార్యదర్శులను పీకేస్తా అంటూ బెదిరించడాన్ని తప్పుబట్టారు.
గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే వారు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు అందజేసింది. విధులకు హాజరుకాకపోతే.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జూనియర్ పంచాయతీ కార్మదర్శులపై సీరియస్ అయ్యారు. సమ్మెబాట పట్టిన పంచాయతీ కార్యదర్శులను పీకేస్తామన్నారు.
తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు లైన్ల పరీక్ష రాయడం రాని ఎర్రబెల్లి పంచాయతీ కార్యదర్శులను పీకేస్తామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. నేడు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న పంచాయతీ కార్మదర్శుల సమ్మెకు దుబ్బాక ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు లైన్ల పరీక్ష రాయని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పికేస్తా అంటూ బెదిరించడమేంటని ప్రశ్నించారు. మరో నాలుగు నెలలయితే.. ప్రజలే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకేస్తారని హెచ్చరించారు. తమను రెగ్యులర్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు కోరితే.. విధుల్లో తక్షణమే చేరకపోతే ఉద్యోగాలు పికేస్తానని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు.మంత్రి ఎర్రబెల్లికి అంత ధైర్యముందా అంటూ బీజేపీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు . ఉద్యోగులంటే గౌరవం లేని మంత్రి అంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే రఘునందన్ రావు టార్గెట్ చేశారు. సెక్రటేరియటకు రాని సీఎం కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత జీతం తీసుకుంటున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్, ముఖ్యమైన మంత్రులు ఉన్న జిల్లా కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని సైటర్లు వేశారు. గ్రామీణా తెలంగాణకు జాతీయ అవార్డులు వచ్చాయంటే.. దానికి కారణం పంచాయతీ కార్యదర్శులేనని పేర్కొన్నారు. ఆ అవార్డులను సాధించడం వెనుక ఎంత మంది కష్టం ఉందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని వెనక్కి పెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్ అనే పదం ఉండదన్న సీఎం కేసీఆర్.. ఆ విషయాన్ని విస్మరించారని విమర్శలు గుప్పించారు.
