దుబ్బాక: తెలంగాణపై బీజేపీది కపట ప్రేమ అని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు తొగుట మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.

ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న హామీని బీజేపీ నెరవేర్చలేదన్నారు. గత ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో తమ ప్రభుత్వం 1,24, 999 మందికి ఉద్యోగాలను కల్పించినట్టుగా ఆయన చెప్పారు.  తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే .ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి ఏనాడూ కూడ రాజీనామా చేయలేదని ఆయన విమర్శించారు.

రైతులకు మద్దతు ధరను లేకుండా బీజేపీ కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ముందు నల్లధనాన్ని వెనక్కి తేస్తామని ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి తెస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ అయ్యాయా అని ఆయన ప్రజలను కోరారు.

పసుపు బోర్డును తెస్తామని హామీ ఇచ్చి నిజామాబాద్ లో ఎంపీ గా విజయం సాధించిన అరవింద్.... ఎందుకు బోర్డును తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఓక్క హామీని కూడ అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు.