సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో యాంకర్ కత్తి కార్తిక ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. నాలుగు రౌండ్లు దాటే సరికి ఆమెకు కేవలం 119 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండులోనూ ఆమెకు వచ్చిన ఓట్ల సంఖ్య రెండంకెలు దాటలేదు. కత్తి కార్తిక దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేశారు. నోటాకు ఇప్పటి వరకు 85 ఓట్లు పోలయ్యాయి. తన స్వగ్రామంలో బిజెపి ఆభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యతను సాధించారు. 

ఇదిలావుంటే, దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తియ్యేసరికి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1259 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు పూర్తయిన మూడు రౌండ్లలోనూ బిజెపికి ఆధిక్యత లభించింది. అనూహ్యంగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రిత రౌండులోనూ ఆధిక్యత సాధించారు. టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో కూడా బిజెపి పాగా వేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో బిజెపికి 110 ఓట్ల ఆధిక్యత లభించింది. 

మెదక్ లోకసభ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్ లో 1,64, 192 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు.  ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 315 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మంది బరిలో ఉన్నారు.ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావులు బరిలో నిలిచారు.2018 ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది.