సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సమయంలో ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి టీఆర్ఎస్, బిజెపిలు కుట్ర పన్నుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కోడానికి సాధ్యం కాకపోవడంతో వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారని... అందులో భాగంగానే తమ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని రేవంత్ అన్నారు. 

ఫేక్ న్యూస్ లను సృష్టించి వాటిని వ్యాప్తి చేసి దుబ్బాక ఓటర్లను గందరగోళానికి గురిచేసి లబ్ది పొందాలని మంత్రి హరీష్ రావు, బిజెపి అభ్యర్థి రఘునందర్ రావు ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తమ అభ్యర్థిపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దుబ్బాక ప్రజలు అనవసరంగా గందరగోళాలకు గురి కావద్దని... దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వేచ్ఛగా ఓటేయాలని రేవంత్ దుబ్బాక ప్రజలను కోరారు.   

స్వగ్రామం తుక్కాపూర్ లో ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం తనపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన కూడా ఇది కాంగ్రెస్, బిజెపి ల కుట్రగా ఆరోపించారు. మహిళల జీవితాలతో ఆడుకున్నది బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి తనయుడేనని ఆయన మండిపడ్డారు. వారికి అధికారాన్ని అప్పగిస్తే దుబ్బాకలో మహిళలకు రక్షణ వుండదన్నారు. కాబట్టి ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటేయాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.