సిద్ధిపేట: బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డితో కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిరిగి ఎంపీ రేవంత్ రెడ్డి రహస్య చర్చలు జరిపారు. దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కమలాకర్ రెడ్డి బిజెపి నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఆయనను కాంగ్రెసులోకి రప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని, కాంగ్రెసులో మంచి భవిష్యత్తు ఉంటుందని రేవంత్ రెడ్డి ఆయనకు నచ్చజెప్పారు. బిజెపిలో నిబద్ధతతో పనిచేసిన నేతగా ఆయన కమలాకర్ రెడ్డిని అభివర్ణించారు. టీఆర్ఎస్ మీద నిరంతర పోరాటంలో ముందు వరుసలో ఉన్నారని ఆయన అన్నారు. 

Also Read: రఘునందన్ రావుపై రేపిస్టు వ్యాఖ్యలు: కమలాకర్ రెడ్డిపై కమలం వేటు

పార్టీ జెండాను మోసిన నాయకులను కాదని బిజెపి మూడు సార్లు ఒకే వ్యక్తికి బిజెపి టికెట్ ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి యువనాయకుల అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీలోకి రావాలని కమలాకర్ రెడ్డిని అడిగినట్లు ఆయన తెలిపారు. 

తప్పు చేసినవారికి టికెట్ ఇచ్చి పనిచేసినవారిని బిజెపి నుంచి సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు. పెళ్లి రోజు నుంచి చావు దాకా వెంట ఉన్నామని చెప్పిన సోలిపేట రామలింగారెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. 

See Video: రేపిస్టుకు టికెట్ - రఘునందన్ రావుపై తోట కమలాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య

తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిన దుర్మార్గులకు మంత్రి పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. మంత్రి హరీష్ రావు పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసేసిన తాహిసీల్దార్ మాదిరిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఇచ్చిన హామీలను అన్నింటినీ తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. 

కల్వకుంట కుటుంబానికి గుణపాఠం చెప్పాలంటే మనమంతా ఏకం కావాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లో కండువా కప్పుకున్న రోజు పండుగ, ఆ తర్వాత దండుగేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.