హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెసులో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెసులో చేరుతారని తాను అనుకోవడం లేదని కాంగ్రెసు నాయకుడు మధు యాష్కీ అన్నారు. 

డిఎస్ టీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి మాత్రం లేదు. అయితే, డిఎస్ బిజెపిలో చేరుతారనే సమాచారం తనకు ఉందని యాష్కీ అన్నారు. డిఎస్ కుమారుడు ఇప్పటికే బిజెపిలో ఉన్నారు. అందువల్ల ఇందులో కొంత మేరకు నిజం ఉండవచ్చునని అనిపిస్తోంది. 

డిఎస్ సోనియాను, రాహుల్ గాంధీని కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మధుయాష్కీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ పార్లమెంటు సీటుకే పోటీ చేస్తానని అన్నారు. సీనియర్లను పార్టీ అధిష్టానం గౌరవిస్తుందని చెప్పారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అవసరం మేరకే బిజెపిని సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఎం అభ్యర్థి, పొత్తులపై కూడా యాష్కీ మాట్లాడారు.