హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెసు పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు. 

డిఎస్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. డిఎస్ పై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరారు. ఈ మేరకు వారు కేసిఆర్ కు లేఖ రాశారు.

డిఎస్ కు గ్రూపులు కట్టే అలవాటు ఉందని, టీఆర్ఎస్ లో కూడా అదే పని చేస్తున్నారని వారు విమర్శించారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో ఆయన గ్రూపులు కట్టారని ఆరోపిస్తున్నారు.

పైరవీలు, అక్రమార్జనకు అలవాటు పడిన డిఎస్ టీఆర్ఎస్ లో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. టీఆర్ఎస్ లో కొనసాగుతూ వచ్చి అవకాశవాదంతో డిఎస్ తన కుమారుడిని బిజెపిలో చేర్పించారని వారన్నారు. కొడుకు ఎదుగుదల కోసం డిఎస్ బిజెపి వద్ద మోకరిల్లుతున్నారని అన్నారు. 

ఈ స్థితిలో డిఎస్ మూడు రోజులుగా ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారనే విషయంపై టీఆర్ఎస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.