భార్య మటన్ వండలేదని డయల్ 100కు కాల్ చేసి ఆకతాయిగా వ్యవహరించిన ఓ తాగుబోతుపై సీరియస్ అయిన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసారు.

నల్గొండ: మద్యంతో పాటు మాంసం కూడా కడుపులో పడితేనే కొందరు మందుబాబులకు కిక్కెక్కుతుంది. ఇలా హోలీ పండగపూట మద్యం సేవించాక మటన్ తినాలని భావించాడో తాగుబోతు. అయితే భార్య మటన్ వండకపోయేసరికి ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఒర్సు నవీన్ శనివారం హోలీ పండగ సందర్భంగా ఇంటివద్దే వున్నాడు. ఈ క్రమంలోనే అతడు హోలీ సంబరాల్లో పాల్గొన్నాక మద్యం సేవించాడు. ఈ మత్తులోనే ఇంటికి చేరుకుని భార్యకు మటన్ వండాలని కోరాడు. అయితే పండగపూట మటన్ వండేందుకు అతడి భార్య నిరాకరించింది. 

మాటవినలేదని భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన నవీన్ విచక్షణను కోల్పోయాడు. ఈ క్రమంలోనే డయల్ 100కు కాల్ చేసి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

ఇలా తాగినమత్తులో అత్యవసర సమయంలో బాధితులు డయల్ చేయాల్సిన 100కు ఫోన్ చేసి ఆకతాయిలా వ్యవహరించి తాగుబోతుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల సమయం వృధా చేసినందుకు, ఆకతాయి చేష్టలకు పాల్పడిన నవీన్ పై కేసు నమోదయ్యింది. 

ఇకపై ఇలా డయల్ 100కు ఫోన్ చేసి ఆకతాయిగా వ్యవహరించేవారికి ఈ ఘటన ద్వారా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేసారు పోలీసులు. అనవసరంగా పోలీసుల సమయాన్ని వృధాచేయడం, విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే ఇలాగే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.