Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. ఈ నిర్ణయం తెలంగాణలో బీజేపీకి బలం చేకూరుస్తుందా..?

రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తెలంగాణలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందిని రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
 

Droupadi Murmu Presidential candidature likely to boosts BJP in telangana
Author
Hyderabad, First Published Jun 22, 2022, 9:52 AM IST

రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఆ పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. భారత రాష్ట్రపతి అయిన మొదటి గిరిజన మహిళగా నిలుస్తారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ప్రధానంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల మీద దృష్టి సారించింది. 

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నియోజకవర్గాలకు బీజేపీ కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు.. ఇప్పటికే ఆ పార్టీ ‘‘మిషన్ 19’’, ‘‘మిషన్ 12’’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. అంతేకాకుండా ఆదిలాబాద్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఉన్న సోయం బాపురావు.. టీ బీజేపీలో ఎస్టీ వర్గానికి ముఖ్య నేతగా ఉన్నారు. 

ఇక, రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే.. వైసీపీ, అన్నా డీఎంకే తదితర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు తెలపకుండా ఉండలేని పరిస్థితి. మరోవైపు ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌తోపాటు ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ద్రౌపదికి మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారి మద్దతు కూడా ద్రౌపది ముర్ముకు దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

ఇక, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే.. తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీల మద్దతు బీజేపీకి లభించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్‌గా ఉన్న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సత్తా చాటిన బీజేపీ.. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇటువంటి తరుణంలో బీజేపీ అధిష్టానం.. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణలో ఆ పార్టీకి కలిసొచ్చే అంశం కానుంది. 

మరోవైపు 2017లో ఎస్సీ నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ రాజకీయ వర్గాలను విస్మయపరచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి మీరా కుమార్‌పై కోవింద్ భారీ విజయం సాధించారు. ఇప్పుడు గిరిజన మహిళను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ మరోసారి రాజకీయ వర్గాలను విస్మయపరిచే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాల ద్వారా ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు‌పై గురిపెట్టడమే కాకుండా, ప్రతిపక్షాల నుంచి ఎటువంటి విమర్శలు ఉండవనేది బీజేపీ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios