కేవలం వెయ్యి రెండువేల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం పెరిగిపెద్దదై ఒకరి దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన తెలంగాాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: కేవలం వెయ్యి రెండువేల కోసం ఎంతోకాలంగా కలిసి పనిచేస్తున్న స్నేహితున్ని అతి దారుణంగ హతమార్చాడు ఓ యువకుడు. లాభాన్ని పంచుకునే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య మాటామాటా పెరిగి చంపుకునే స్థాయికి చేరింది. ఇలా ఓ డ్రైవర్ సోదరుడు, స్నేహితులతో కలిసి తోటి డ్రైవర్ ను కత్తులతో నరికిచంపాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీ లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడ షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్ (23), మహ్మద్ అష్రఫ్ (37) ఇద్దరూ ఒకేచోట డిసిఎం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నాంపల్లిలోని బిస్మిల్లా చికెన్ సెంటర్ లో కోళ్ళను సరఫరా చేసే డిసిఎంను వీరు నడిపేవారు. ఇలా కోళ్ల సరఫరా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇద్దరూ పంచుకునేవారు. అయితే డబ్బులు పంపకం విషయంలో ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయి. 

ట్రిప్పుకు రూ.3‌వేల నుండి రూ.4వేల వరకు ఆదాయం రాగా అందులో 60శాతం అష్రఫ్ తీసుకుని కేవలం 40శాతం మాత్రమే తనకు ఇస్తున్నట్లు జహంగిర్ గుర్తించాడు. దీంతో ఇద్దరం సమానంగా కష్టపడుతున్నాం కాబట్టి లాభాలు కూడా సమానంగానే పంచుకుందామని జహంగిరి కోరాడు. ఇందుకు అష్రఫ్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలోను కోపంలో తనను మోసం చేస్తూ చంపేస్తానని అష్రఫ్ ను జహంగిర్ బెదిరించాడు. 

అయితే జహంగిర్ ఆవేశంలో చంపేస్తానని బెదిరించగా నిజంగానే చంపుతాడేమోనని అష్రఫ్ భయపడిపోయాడు. దీంతో అతడి కంటే ముందుగా తానే చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన సోదరుడు షఫీ(22)తో పాటు స్నేహితులు అర్భాజ్(22), హబీబ్ (26) సాయం తీసుకున్నాడు అష్రఫ్. ఈ నలుగురూ కలిసి జహంగిర్ హత్యకు ప్లాన్ వేసారు.

మాట్లాడుకుందామని చెప్పి లంగర్‌హౌస్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నం.96 సమీపంలోని వైఫై బార్‌ వద్దకు జహంగిర్ ను పిలిచాడు అష్రఫ్. నిజమేనని నమ్మి అతడు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే కత్తులతో సిద్దంగా వున్న నలుగురు నిందితులు జహంగిర్ రాగానే ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో రక్తపుమడుగులో పడి జహంగిర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది నిర్దారించుకున్న తర్వాతే అష్రఫ్ తో పాటు మిగతా ముగ్గురు నిందితులు పరారయ్యారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న లంగర్ హౌజ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో వున్న నలుగురు నిందితులను ఆదివారం రాత్రి రింగ్‌రోడ్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.

ఇదిలావుంటే మానవ సంబంధాలే కాదు స్నేహాలు కూడా ఆర్థిక సంబంధాలేనని ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన మరో దారుణ హత్య నిరూపించింది. కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితున్ని బండరాయితో మోది అతి కిరాతకంగా చంపాడో కసాయి. కౌడిపల్లి మండలంలోని తునికి అటవీ ప్రాంతంతో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మాలోతు సురేష్ (32) గా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలంలో ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే సురేష్ ని హతమార్చిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేసి మరోసారి ఆధారాలను సేకరించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి కాట్రోజు శ్రీను అనే వ్యక్తి కూడా ఘటనాస్థలం వద్దకు వెళ్లి పోలీసులను రహస్యంగా గమనిస్తూ అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించగా సురేష్ ను తానే హత్య చేసినట్లు బయటపెట్టాడు. అవసరాల కోసం తీసుకున్న వెయ్యి రూపాయిలు తిరిగివ్వకపోవడంతోనే సురేష్ ను హతమార్చినట్లు శ్రీను తెలిపారు.