చిన్న విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ క్లీనర్‌ను లారీ డ్రైవర్ హత్య చేసి అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన డ్రైవర్‌ నైఫ్‌రాజు, క్లీనర్‌ రాజు నూకల లోడు కోసం కరీంనగర్‌ వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ లోడుకు పట్టా కట్టే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకుంది. 

ఈ క్రమంలో క్లీనర్‌ రాజును రాడ్‌తో మోదీ కత్తితో పొడిచాడు. అనంతరం శవాన్ని లారీలో వేసుకుని కాకినాడ బయలుదేరారు. ఖమ్మం దాటగానే జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

హత్య చేసి లారీలో మృతదేహంతో సహా స్టేషన్‌కు రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. డ్రైవర్‌ నైఫ్‌రాజు మాత్రం.. తాను ఆత్మరక్షణ కోసం కత్తితో పొడిచానని.. క్లీనర్‌ కత్తితో తనను హత్య చేయాలని చూశాడని చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.