మూసీ ఒడ్డున డ్రైవర్‌ హత్య, మృతదేహం దహనం.. ఐదుగురు అరెస్ట్..

పది రోజుల క్రితం మూసి నది ఒడ్డున జరిగిన డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దొంగిలించిన సొమ్ము పంచుకునే క్రమంలో ఏర్పడిన వివాదం ఈ దారుణ హత్యకు దారి తీసింది. 

Driver killed, body burnt on Musi bank, Five arrested In hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సుమారు 10 రోజుల క్రితం ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని మూసీ ఒడ్డున దహనం చేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. దొంగిలించిన సొత్తును పంచుకోవడంపై వాగ్వాదం చెలరేగడంతో వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడిని ఎండీ ఇమ్రాన్ (23) గా గుర్తించారు. అతనికి క్రిమినల్ రికార్డ్ ఉంది. ఓ హత్య కేసు, రెండు ఆస్తి వివాదాలలో నిందితుడు. అతడిని హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురికి నేర చరిత్ర కూడా ఉందని సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు.

ఆగస్టు 5న ఉదయం ఇమ్రాన్‌ సరూర్‌నగర్‌లోని భగత్‌సింగ్‌ నగర్‌లో తన ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఇమ్రాన్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తల్లి ముంతాజ్‌తో స్నేహితుడైన సత్తిని కలవడానికి వెళుతున్నానని చెప్పాడు. రాత్రి అతనికి ఫోన్ చేసినప్పుడు స్కూటర్ రిపేర్ వచ్చిందని.. అది చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడని చెప్పాడని రాచకొండ పోలీసు తెలిపారు.

వరంగల్ లో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం...

ఆగస్టు 6వ తేదీ కూడా ఇమ్రాన్ రాకపోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. తల్లి ముంతాజ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 7 వరకు అతని కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆగస్టు 7న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.

పోలీసులు ఇమ్రాన్ కాల్ వివరాలను విశ్లేషించారు. అతని స్నేహితుల గురించి కూడా ఆరా తీశారు. సోమవారం హత్యకు పాల్పడిన సతీష్ అలియాస్ సత్తి, ఎస్ శేఖర్, బీ అరుణ్ కుమార్, ఆర్ శ్యామ్ సుందర్, కే రాహుల్‌లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సోను సింగ్ అలియాస్ లక్ష్మణ్ సింగ్ పరారీలో ఉన్నాడు.

ఆగస్టు 6న ఉదయం తాము చైతన్యపురి వద్ద మూసీ నది ఒడ్డున కలుసుకున్నామని, దొంగిలించిన సొత్తును పంచుకోవడంపై తమ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని నిందితులు అంగీకరించారు. "వాగ్వాదం సమయంలో, లక్ష్మణ్ సింగ్, మిగతావారు కత్తితో ఇమ్రాన్ మెడపై అనేకసార్లు పొడిచారు. ఆ తరువాత, పెట్రోల్ పోసి ఇమ్రాన్ మృతదేహాన్ని తగులబెట్టారు" అని ఇన్స్పెక్టర్ చెప్పారు.

ఘటనా స్థలంలో కాలిపోగా మిగిలిన అస్థిపంజరం అవశేషాలు, రక్తంతో తడిసిన మట్టి, సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు సేకరించారు. ఇమ్రాన్ కుటుంబంతో డీఎన్ఏ మ్యాచ్ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపారు. కేసును చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios