వరంగల్:  అకారణంగా తిట్టాడనే కారణంగా ఓ వ్యక్తిపై జేసీబీతో దాడి చేయడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ విషయమై స్థానికులు జేసీబీ డ్రైవర్ తీరుపై మండిపడుతున్నారు.

ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని కమలాపూర్ లో జేసీబీతో రోడ్డు పనులను నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. అయితే రోడ్డు పక్కనే కూర్చొన్న సూరయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో జేసీబీ డ్రైవర్ ను దూషించాడు.

ఇష్టమొచ్చినట్టుగా తిట్టడంతో జేసీబీ డ్రైవర్ సూరయ్యపై ఆగ్రహంతో జేసీబీతో ఢీ కొట్టాడు. దీంతో సూరయ్య కిందపడిపోయాడు. వెంటనే జేసీబీని తీసుకొని డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

also read:తిరుపతిలో దారుణం: కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం జేసీబీతో పూడ్చివేత

జేసీబీ డ్రైవర్ సూరయ్యను ఢీకొడుతున్న సమయంలో అక్కడే ఉన్న వారెవరూ కూడ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ వీడియోలు మీడియాకు పంపాడు. 

ఈ ఘటనపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జేసీబీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం మత్తులో అకారణంగా తిట్టాడనే నెపంతో జేసీబీతో దాడి చేయడం సరైంది కాదని గ్రామస్తులు అభిప్రాయంతో ఉన్నారు.