తిరుపతి: కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వం లేకుండా  చేస్తోంది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో పూడ్చి పెట్టారు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకొంది.

ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కూడ కరోనాతో మరణించిన రోగి మృతదేహాన్ని జేసీబీతో పూడ్చిపెట్టారు మున్సిపల్ సిబ్బంది. ఈ విషయమై మీడియాలో వార్తలు రావడంతో ఇందుకు బాధ్యులైన మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ ఘటన మర్చిపోకముందే తిరుపతిలో సోమవారం నాడు ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది.

తిరుపతి పట్టణంలోని స్మశానవాటికలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో పూడ్చిపెట్టారు.అంబులెన్స్ ను స్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. అంబులెన్స్ నుండి డెడ్ బాడీని  జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు.

ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్‌పోన్ లలో  చిత్రీకరించారు. ఈ దృశ్యాలు మీడియాకు పంపారు. మృతదేహంలో కనీసం ఆరు గంటల పాటు కరోనా వైరస్ బతికి ఉంటుందనని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీంతో  అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై మృతుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరి చూపు చూసుకోకుండా అంత్యక్రియలను జేసీబీతో నిర్వహించడంపై కుటుంబసభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.