శేజల్ కోసం కేఎ పాల్ ప్రత్యేక ప్రార్థనలు.. డా.ప్రీతీలాగే చంపేయాలని చూస్తున్నారంటూ కేటీఆర్ పై మండిపాటు..
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన శేజల్ కోసం కేఎ పాల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డా.ప్రీతీలాగే శేజల్ ను కూడా చంపేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గురువారం మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ కోసం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రార్థనలు చేశారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చారు. ఆ తరువాత మాట్లాడుతూ.. ‘కేసీఆర్, కేటీఆర్... దేవుడు మిమ్మల్ని క్షమించడు, నేను మిమ్మల్ని క్షమించను.. తెలంగాణ రాస్ట్రం మిమ్మల్ని క్షమించదు..కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అన్నారు.
కె ఎ పాల్ శేజల్ తల్లి, అమ్మమ్మ, సోదరుడు మాట్లాడారు. వారి అభ్యర్థన మేరకు ఆయన ఆస్పత్రికి వెళ్లి ప్రార్థనలు చేశారు. నాడి పట్టుకుని చూశాను.. ప్రార్థనలు చేశాను. ఆమెకు ప్రాణాపాయం లేదు.. అని చెప్పుకొచ్చారు. అయితే, ఆమెను చంపే ప్రయత్నం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి గాంధీకో, నిమ్స్ కో తరలించి.. చంపేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.
దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల కేసు : మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. నాకిక న్యాయం జరగదంటూ లేఖ
ఈ సందర్భంగా కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు కేఏ పాల్. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేదిస్తున్నాడంటూ గత 45రోజులుగా ఆమె ఆరోపిస్తుంటే.. అతడిని మీరు సస్పెండ్ చేయలేదు కానీ.. ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ.. ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పుడు నేనుమీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను అంటూ హెచ్చరించారు.
డాక్టర్ ప్రీతీలాగానే శేజల్ కూడా ఆస్పత్రిలో మృతి చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దుర్గం చిన్నయ్యను ఎన్ కౌంటర్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. మీరు చేసేదాన్ని మీడియా మిత్రులు, హ్యూమన్ రైట్స్, ఉమెన్స్ రైట్స్, ప్రజలు అందరూ ఖండిస్తున్నారు.
మీ పార్టీ ఎమ్మెల్యే అయితే అతను చేసిన తప్పులను కవర్ చేస్తారా? కనీసం ఇన్వెస్టిగేషన్ చేయరా? అని ప్రశ్నించారు.