హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావుపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎంవీ.శర్మ తన కుమార్తె సింధు శర్మను .. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కుమారుడు వశిష్టకు ఇచ్చి 2012లో వివాహం జరిపించారు.

వివాహ సమయంలో ఘనంగా కట్న, కానుకలు ఇచ్చారు. అయితే పెళ్లయిన 15 రోజులకే ఆమెకు అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు సింధును అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.... మరికొన్ని లాంఛనాలు, కానుకలు కూడా ఇచ్చారు. అయినప్పటికి రామ్మోహన్ రావు కుటుంబసభ్యులు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో గర్భం దాల్చిన సింధు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

ఈ నెల 20న అర్ధరాత్రి భర్త, అత్తమామలు కలిసి తమ కుమార్తెపై దాడి చేశారని.. విచక్షణారహితంగా కొట్టి అపోలో ఆసుపత్రిలో చేర్పించారని సింధుశర్మ తండ్రి ఎంవీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెకు పిచ్చిపట్టిందని చెప్పి వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

అయితే  సింధు ఒంటిపై గాయాలను గమనించిన వైద్యురాలు.. దీనిని మెడికో లీగల్ కేసుగా భావించి తమకు సమాచారమిచ్చారని ఆయన తెలిపారు. విషయం తెలియగానే తాము ఆస్పత్రికి వెళ్లామని.. ఇంకా తల్లిపాలు తాగుతున్న చిన్నారిని తమకు అప్పగించాలని కోరినా రామ్మోహన్‌రావు కుటుంబం ఒప్పుకోలేదని ఎంవీ శర్మ తెలిపారు.

దీంతో నూతి రామ్మోహన్‌రావు, ఆయన భార్య దుర్గా జయలక్ష్మీ, కుమారుడు వశిష్టలపై సింధుశర్మ శనివారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 498-ఏ, 406, 323 ఐపీసీ సెక్షన్ -4, అండ్ 6 ఆఫ్ డీపీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.