ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా అనాలోచిత నిర్ణయం తీసుకున్నది కాకుండా ఎన్నికల్లో దొంగ ఓట్ల నియంత్రణ కోసమని చుక్కలు పెట్టినట్లు బ్యాంకులకు వచ్చిన వారికి చుక్కలు పెట్టి అవమానిస్తున్నది.

బ్యాంకుల్లో డబ్బు అయిపోయినట్లే కనబడుతోంది. అందుకే రిజర్వ్ బ్యాంకు వేలికి చుక్క పెట్టటమనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, డబ్బులు తీసుకున్న వారే మళ్ళీ మళ్ళీ బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకుంటున్న కారణంగా అందరికీ డబ్బులు అందటం లేదని దాస్ చెప్పటం పలు విమర్శలకు దారితీస్తోంది.

బ్యాంకులు ఇపుడు ఒక్కో ఖాతాదారుకు ఇస్తున్నదే ఒక్కసారికి 4500 రూపాయలు. వారంలో రెండు సార్లకన్నా డబ్బు తీసుకోవటానికి అనుమతించరు. తాజాగా ఒక్కసారికి 24 వేల రూపాయలు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇక, ఏటిఎంల్లో అయితే 2500 రూపాయలకన్నా రాదు. పైగా 95 శాతం ఏటిఎంల్లో అసలు డబ్బులే లేవు.

పైగా వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి ప్రకటించింది 8వ తేదీన. అంటే అప్పటికి వేతన జీవులు నెలవారీగా ఇవ్వాల్సన వారికి పూర్తిగా డబ్బులు ఇచ్చి ఉండరు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతీ ఒక్కరూ 100, 50 రూపాయల కోసం తిరగని చోటు లేదు. ఒక్క బ్యాంకుల్లో తప్ప ఇంకెక్కడా 100లు దొరకటటం లేదు కాబట్టి ఎన్ని సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగితే నెల అవసరాలకు సరిపడా డబ్బు సమకూరుతుంది?

ప్రతీ రోజు ఐదారు గంటల పాటు క్యూల్లో నిలబడైనా సరే డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నారంటే ప్రతీ ఒక్కరికీ డబ్బులు ఎంత అవసరమో తెలీదా? ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా అనాలోచిత నిర్ణయం తీసుకున్నది కాకుండా ఎన్నికల్లో దొంగ ఓట్ల నియంత్రణ కోసమని చుక్కలు పెట్టినట్లు బ్యాంకులకు వచ్చిన వారికి చుక్కలు పెట్టి అవమానిస్తున్నది. ఇటువంటి చర్యలను గమనిస్తున్న వారికి బ్యాంకుల్లో అసలు డబ్బులు లేవేమోనన్న అనుమానం కలుగుతోంది. ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు తీసుకోనీయకుండా ప్రజలను నియంత్రించి గట్టెక్కాలని కేంద్రప్రభుత్వం చూస్తున్నట్లుందని పలువురు అనుమానిస్తున్నారు.