పోస్ట్ మార్టం వద్దంటూ.. మృతదేహాన్ని భుజంమీద వేసుకుని పరుగో పరుగు..
ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. అయితే శవపరీక్ష వద్దంటూ అతడికి కొడుకు వరసయ్యే వ్యక్తి మృతదేహంతో పరుగులు తీశాడు.

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో పోలీసులు అతడికి శవపరీక్ష నిర్వహించాలని అనుకున్నారు. కానీ, చనిపోయిన వ్యక్తి బంధువు ఒకరు పోస్టుమార్టంకి అభ్యంతరం తెలిపాడు. అంతటితో ఆగకుండా.. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తారేమో అని భయంతో మృతదేహాన్ని తీసుకొని పరుగులు తీశాడు. అయితే పోలీసులు అతడిని వదిలిపెట్టలేదు. ఆ బంధువును అడ్డుకొని మృతదేహానికి ఎట్టకేలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య అనే 65 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లోనే అతను మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు అంత్యక్రియలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ మరణం గురించి గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని సిరిసిల్లకు తరలించాలని తెలిపారు.
'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్ .. మెయిన్స్ ఎప్పుడంటే?
అయితే, దీనికి మల్లయ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులు వారితో మాట్లాడి ఒప్పిస్తుండగానే… మల్లయ్య తమ్ముడి కుమారుడు రాజు.. ఒకసారి మల్లయ్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. గుండెపోటుతోనే మల్లయ్య చనిపోయాడని..ఆయన మరణంపై తమకు ఎలాంటి అనుమానం లేదని స్మశానం దిక్కు పరుగులు పెట్టాడు. అయితే పోలీసులు అతడిని వెంబడించారు. మృతదేహాన్ని సిరిసిల్లకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
అనుమానాస్పద మృతిగా మల్లయ్య మరణాన్ని కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి మామూలుగానే అందరం కలిసి భోజనం చేసి పడుకున్నామని.. ఉదయం లేచి చూసేసరికి భర్త చనిపోయి ఉన్నాడని మృతుడి భార్య చంద్రవ్వ పోలీసులకు తెలిపింది. తనకు ఎవరి మీద అనుమానం లేదని.. విచారణ చేపట్టి చర్య తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.