ఖమ్మం: మాకు వచ్చిన పరిస్థితి మరెవరికి కూడ రాకూడదని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి భార్య  కోరుకొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకొన్నట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైద్రాబాద్ లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు.

శ్రీనివాస్ రెడ్డి మృతి తర్వాత ఆమె మీడియాతో  మాట్లాడారు. తన భర్తను కళ్లలో పెట్టుకొని చూసుకొన్నాను. మార్నింగ్ టిఫిన్ చేసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తన భర్త తనకు మళ్లీ కావాలని ఆమె భోరున విలపించారు.

ఏ రోజు కూడ ఇంట్లో నుండి బయటకు రాని  దాన్ని ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తోందని తాను ఊహించలేదన్నారు.తన కుటుంబంతో పాటు  రాష్ట్రంలోని 48వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.

కొన్ని రోజుల్లో రిటైరయ్యే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ ను సోమవారం నాడు నిర్వహించారు.ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడని ఆర్టీసీ జేఎసీ ఆరోపించింది. 

ఎవరూ కూడ ఆత్మహత్యలు చేసుకోవద్దని శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఆర్టీసీ కార్మికులను కోరారు. ఆత్మహత్యలకు పాల్పడితే తమ కుటుంబం మాదిరిగానే అనాధలుగా మారుతారని ఆయన అభిప్రాయపడ్డారు. తన తమ్ముడి ముందే తన తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన గుర్తు చేసుకొని భోరుమన్నాడు.