జనగామ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ గుండెపోటుతో మరణించాడు. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ (31) ట్రంప్ వీరాభిమానిగా పేరు పొందాడు. 

కుటుంబ సభ్యులు అతని వీరాభిమానానికి సంబంధించిన విషయాలను చెప్పారు. ట్రంప్ విగ్రహాన్ని కృష్ణ తన నివాసంలో ప్రతిష్టించారు. డోనాల్ట్ ట్రంప్ నకు కరోనా వైరస్ సోకిందని తెలిసి కృష్ణ మనోవేదనకు గురైనట్లు చెబుతున్నారు. 

Also Read: ట్రంప్ నా కలలోకి వచ్చాడంటూ... విగ్రహం కట్టిన తెలంగాణవాసి

దాంతో ఆదివారం గుండెపోటు రావడంతో కృష్ణను తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్నేళ్ల క్రితం కృష్ణ భార్య మరణించింది. అయితే, అతనికి ఏడేళ్ల వయస్సు గల కుమారుడు రుషి ఉన్నాడు.

ట్రంప్ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కృష్ణ ప్రతి శుక్రవారం పూజలు చేసేవాడు. ఆ రోజు ఉపవాసం కూడా చేసేవాడు. ప్రతి రోజూ పూజలు చేస్తూ వచ్చాడు. ట్రంప్ ఆరడుగుల విగ్రహాన్ని తన ఇంటి ప్రాంగణంలో ఏర్పాటు చేశాడు. దాన్ని నిర్మించేందుకు 15మంది కూలీలు నెల రోజుల పాటు శ్రమించారు.