అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఓ విగ్రహం ఏర్పాటు చేశారు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం ఏర్పాటు  చేయడం గమనార్హం. ఓ తెలంగాణ వాసి ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటుచేసి... చిన్నపాటి గుడి కట్టినంత పనిచేశాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా బస్సకృష్ణ అనే యువకుడు ట్రంప్ కి వీరాభిమాని. ఎంతలా అంటే.. ట్రంప్ కోసం ఏకంగా గుడి కట్టేటంత. అంతేకాదు... ఆయన కోసం ఉపవాసాలు చేసేటంత అభిమానం.

అందరిలా నాకు అభిమానం ఉంది అని చెప్పుకోవడం ఎందుకని.. తన ఇష్టాన్ని అందరికీ కళ్లారా చూపించాలని అనుకున్నాడు. అంతే డోనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని నిర్మించి రోజూ పూజ చేస్తున్నాడు. తాను ట్రంప్ ను భగవంతునిగా నమ్ముతానని బుస్స కృష్ణ తెలిపాడు.  ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా ట్రంప్ కు పూజ చేసిన తర్వాతే తాను పని  ప్రారంభిస్తానని చెప్పటం విశేషం. ప్రతి శుక్రవారం ట్రంప్ .. ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తానని ఆ రోజు ఉపవాసం కూడా ఉంటానని తెలిపాడు. అంతేకాదు ట్రంప్ తన కలలోకి వస్తుంటాడని కూడా అతను చెప్పడం విశేషం. 

Also Read ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

తన ఇంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా ట్రంప్ ఆరు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని నిర్మించేందుకు 15 మంది కూలీలు ఒక నెల రోజులపాటు శ్రమించారు. ట్రంప్ పై వీరాభిమానంతో పూజలు చేస్తున్న బుస్స కృష్ణను .. ఆయన గ్రామస్తులు, స్నేహితులు అంతా ట్రంప్ కృష్ణ అని పిలవడం విశేషం. గ్రామస్తులు కూడా ట్రంప్ కృష్ణ .. వీరాభిమానాన్ని మెచ్చుకుంటున్నారు.  

ఇదిలా ఉండగా...ఈ నెల 24,25వ తేదీల్లో ట్రంప్... భారత పర్యటనకు తన సతీమణితో కలిసి వస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ పలు ఏర్పాట్లు కూడా చేశారు. మరి ఈ పర్యటన సమయంలో ట్రంప్.. తన వీరాభిమాని గురించి తెలుసుకుంటాడో లేదో చూడాలి.