కుక్కకి విశ్వాసం ఎక్కువ అని అందరూ చెబుతూ ఉంటారు. యజమాని పట్ల కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. ఒక్కపూట తిండిపెట్టినా.. జీవితాంతం గుర్తుంచుకుంటాయి. అయితే.. ఓ కుక్క మాత్రం తన యజమాని కుటుంబాన్ని కాపాడటానికి చావుతో పోరాడింది. ఓ విష నాగుతో పోరాడి.. తన ప్రాణాలను దారపోసి తన యజమాని కుటుంబాన్ని రక్షించింది. ఈ సంఘటన  ఖమ్మం జిల్లా కల్లూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read తెలంగాణలో కోరనా వైరస్ కేసులకు దియో బంద్ ట్విస్ట్...

గోపాలకుంట కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు అచ్చేపల్లి కిషోర్‌, వెంకటలక్ష్మి దంపతులు ఏడేళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కిషోర్‌ దంపతులు నిద్రపోతుండగా.. ఇంటి వెనుక నుంచి ఓ తాచుపాము బెడ్‌రూంలోకి ప్రవేశించింది. దానిని పసిగట్టిన కుక్క గట్టిగా అరుస్తూ పాముపై దాడిచేసింది. ఈ అలికిడి విన్న కిషోర్‌ వెంటనే కర్రను తీసుకుని పామును కొట్టేందుకు ప్రయత్నించాడు. 

దీంతో అది పడగ విప్పి ఆయనపై బుసకొట్టింది. పక్కనున్న కుక్క మరింత ఆగ్రహంతో పాముపై తీవ్రంగా దాడి చేసింది. సర్పాన్ని నోటితో పట్టుకుని ఇంటి బయటకు తీసుకెళ్లింది. ఆ సమయంలో కుక్కను పాము కాటేసింది. దీనిని గమనించిన కిషోర్‌ కర్రతో పామును చంపేశాడు. వెంటనే కుక్కను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయింది. ఏడేళ్లుగా పెంచుకుంటున్న కుక్క.. తమ కోసం ప్రాణాలను త్యాగం చేసిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. దానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.