హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ప్రధాన అనుచరుడు డాక్టర్ రవికుమార్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.  రవికుమార్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.

త్వరలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 1న ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జానారెడ్డిని ఈ స్థానం నుండి బరిలోకి దింపనుంది. జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న డాక్టర్ రవి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ నెల 27న రవికుమార్ బీజేపీలో చేరనున్నారు.  గత నాలుగేళ్లుగా రవికుమార్ నియోజకవర్గంలో  పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 స్థానాల నుండి 48 స్థానాలకు పెరిగింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ విజయం సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలపై  బీజేపీ వల విసురుతోంది. ఈ స్థానంలో విజయం సాధించాలని కమలదళం పావులు కదుపుతోంది.

మరో వైపు ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఏడుసార్లు ఇదే స్థానం నుండి విజయం సాధించారు జానారెడ్డి. రెండు సార్లు ఓడిపోయారు. ఈ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.