హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియాంకరెడ్డిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

లారీ డ్రైవర్, క్లీనర్ లతోపాటు మరో ఇద్దరు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ కు చెందిన మహ్మద్ పాషా ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. 

నిందితులు నలుగురు మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ప్రియాంకరెడ్డిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

గచ్చిబౌలి నుంచి ప్రియాంకరెడ్డి రావడాన్ని చూసిన నిందితులు ఉద్దేశపూర్వకంగానే టైర్ పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తాము పంక్చర్ వేస్తామని నమ్మించి అనంతరం ఆమెను కిడ్నాప్ చేసినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. 

కిడ్నాప్ చేసిన అనంతరం ఆమెపై నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంకరెడ్డి బతికి ఉంటే తమకు ఇబ్బంది అని భావించిన నిందితులు ఆమెను అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. 

ఆ తర్వాత పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు చటాన్ పల్లిబ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. 

అయితే పోలీసులకు అటువైపు వెళ్తున్న పాలవ్యాపారి మంటలను గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మహిళ మృతదేహంగా గుర్తించారు.  

అయితే ఈ ఘటనలో నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా వ్యవహరించారని తెలుస్తోంది. ఒక చోట హత్య చేసి ఎవరికీ అంతుపట్టకుండా మృతదేహాన్ని చటాన్ పల్లి బ్రిడ్జ్ కింద లారీలో తీసుకువచ్చి మరీ దహనం చేశారు. 

అంతేకాదు ప్రియాంకరెడ్డి స్కూటీని ఘటనా స్థలం నుంచి 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి విడిచిపెట్టడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

ఇదిలా ఉంటే ప్రియాంకరెడ్డి హత్యకేసుపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకరెడ్డి హత్య కేసును విచారించాలని నిర్ధారించింది. అందులో భాగంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులను హైదరాబాద్ కు పంపింది. 

శుక్రవారం సాయంత్రానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కేసు విషయమై తెలంగాణ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉంది. 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రియాంకరెడ్డి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్య చాలా దురదృష్టకరమన్నారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. 

మరోవైపు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ యువతీ, మహిళలలు షీ టీమ్ కాల్ సెంటర్ నంబర్స్ తీసుకోవాలని సూచించారు.