ఇబ్రహీంపట్నంలో మరణించిన నాలుగు కుటుంబాలకు కోటి పరిహరం ఇవ్వాలి: బండి సంజయ్ డిమాండ్
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ చేసుకున్న నలుగురు మహిళలు మృతి చెందడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గంటలోపుగానే 34 మందికి ఆపరేషన్లు చేశారని ఆయన ఆరోపించారు. ఎలాంటి పరీక్షలు చేయకుండానే పరీక్షలు చేశారన్నారు.
హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత మరణించిన నాలుగు కుటుంబాలకు కోటి రూపాయాలను పరిహారంగా చెల్లించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హడావుడిగా ఈ ఆపరేషన్లు చేశారని ఆయన ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న 34 మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లు చేసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు మృతి చెందారు. మిగిలిన వారిలో హైద్రాబాద్ నిమ్స్ లో 19 మంది,జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో 11 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ శస్త్రచికిత్సలు చేసుకున్న మహిళలు పేద కుటుంబాలకు చెందినవారని బండి సంజయ్ చెప్పారు. గంటలోపుగానే 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారని బండి సంజయ్ ఆరోపించారు. అంతా హడావుడిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనకు పేరు ప్రఖ్యాతలు వస్తే చాలని కేసీఆర్ అనుకొంటారని ఆయన విమర్శించారు. కానీ పేద ప్రజల ప్రాణాలను కేసీఆర్ గాలికి వదిలేశారని ఇబ్రహీంపట్టణం ఘటన రుజువు చేస్తుందన్నారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ పేదల ఉసురు తీసుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.
ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోతే పట్టించుకోకుండా బీహర్ వెళ్లి ఏం ఉద్దరిస్తావని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.24 గంటలు రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం కేసీఆర్ కు పట్టదని బండి సంజయ్ మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రిని అబద్దాల మంత్రిగా యువత పిలుస్తున్నారన్నారు.
also read:కారణమిదీ: ఇబ్రహీంపట్నంలో కు.ని. శస్త్రచికిత్స తర్వాత నలుగురు మహిళల మృతి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మరణించిన కుటుంబాలకు కోటి రూపాయాల పరిహారం చెల్లించాలన్నారు. మృతుల పిల్లలను ప్రభుత్వమే చదవించాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని ఆయన కోరారు.ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన బాధితులను పరామర్శించకపోవడంపై క్షమాపణ చెప్పాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు.