జగిత్యాల  ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  వచ్చిన  మహిళ కడుపులో  వైద్యులు క్లాత్  వదిలేశారు.  దీంతో   ఏడాదిగా  బాధితురాలు  కడుపునొప్పితో   బాధపడుతుంది.  ప్రైవేట్  ఆసుపత్రి వైద్యులు  ఆమెకు  ఆపరేషన్  చేసి  కడుపులో నుండి క్లాత్ తొలగించారు.

కరీంనగర్: జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలీవరీ కోసం వచ్చిన మహిళ నవ్యశ్రీకి సిజేరియన్ చేశారు వైద్యులు. సిజేరియన్ ఆపరేషన్ చేసే సమయంలో బాధితురాలు నవ్యశ్రీ కడుపులో క్లాత్ ను వదిలేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.

 డెలీవరీ తర్వాత బాధితురాలు తరచుగా కడుపునొప్పితో బాధపడుతుంది. దీంతో ఆమె ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేశారు. కడుపులో క్లాత్ ఉన్నట్టుగా గుర్తించారు. కడుపులో క్లాత్ ఉన్న విషయం తెలిసి బాధితురాలు షాక్ కు గురైంది. బాధితురాలు నవ్యశ్రీ కి ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి క్లాత్ ను తొలగించారు. డెలీవరీ సమయంలో నిర్లక్ష్యంగా నవ్యశ్రీ కడుపులో క్లాత్ ను వదిలేసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు నవ్యశ్రీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

బాధ్యులపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించారు. నవ్యశ్రీ కి ఆపరేషన్ చేసిన సమయంలో కడుపులో క్లాత్ ను వదిలిన వైద్యులపై చర్యలు తీసుకంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయమై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ రాములును కలెక్టర్ ఆదేశించారు.