తెలంగాణలో విజృంభణ: కరోనాతో హైదరాబాదులో డాక్టర్ మృతి
తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఓ వైద్యుడు కరోనా బారిన పడి మరణించాడు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏజీఎంలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి నానాటికీ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాదులో దాని వ్యాప్తి విపరీతంగా జరుగుతోంది. తాజాగా కరోనా వైరస్ బారిన పడి హైదరాబాదులో ఓ వైద్యుడు మరణించాడు. జ్ఞానేశ్వర్ అనే వైద్యుడు హైదరాబాదులో కోవిడ్ 19తో మరణించినట్లు సమాచారం అందుతోంది.
ఇదిలావుంటే, వరంగల్ లోని ఏజీఎం ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.
తెలంగాణలో ఆదివారంనాడు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,525కు చేరుకుంది. ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఒక్క రోజోులు హైదరాబాదులోనే 329 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో నాలుగేసి కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు, జనగామ జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి.