పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ నర్స్‌పై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ అల్‌జుబైల్ కాలనీకి చెందిన ఓ మహిళకు పెళ్లయి పిల్లలున్నారు.

ఆమె భర్త ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లాడు. నర్సింగ్ కోర్స్ చదివిన ఆమె ఇంజన్‌బౌలిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడికి చాంద్రాయణగుట్ట హాషామాబాద్‌కు చెందిన ఎం.ఎ అలీమ్ మోహియుద్దీన్ వైద్యుడిగా వచ్చాడు.

ఈ క్రమంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. తన భర్త సౌదీలో ఉంటాడని ఆమె చెప్పడంతో దీనిని అలుసుగా తీసుకున్న వైద్యుడు.. తాను అండగా ఉంటానని నమ్మించి లోబరుచుకున్నాడు.

రాను రాను డాక్టర్ ప్రవర్తనలో మార్పు రావడం.. తనకు దూరంగా ఉండటంతో నర్సుకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన ఆమె తనను అలీమ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళ చెప్పిన విషయాలు పోలీసులకు కొత్త అనుమానాలను కలిగిస్తున్నాయి.

పెళ్లయి కూడా డాక్టర్‌తో సంబంధం పెట్టుకోవడంపై వారు ఆరా తీస్తున్నారు. దీంతో ఆమె ఇష్టపూర్వకంగానే వైద్యుడితో వివాహేతర సంబంధం కొనసాగించిందా అన్న కోణంలో విచారిస్తున్నారు.