రామోజీ ఆస్తుల విలువెంతో తెలుసా...? ఆయన వారసులెవరు..?
Ramoji Rao: రామోజీ రావు. మీడియా మొఘల్ గా, ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా సుపరిచితులు. శనివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మరి, రామోజీ రావు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన వారసులు ఎవరు...?
రామోజీరావు... సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అసాధారణ స్థాయికి ఎదిగిన శక్తి. ఈనాడు, ఈటీవీతో పాటు డజన్ల కొద్దీ వ్యాపారాలతో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఉపాధి చూపించడమే కాకుండా.. వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు. ఆయన మీడియా రంగంలో ఎదిగిన తీరు ఒక ఎత్తయితే, సమాంతరంగా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం మరో ఎత్తు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రామోజీరావుకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ లక్షల కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
చెరుకూరు రామోజీ రావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి.. దేశం గుర్తించదగ్గ స్థాయికి ఎదిగారు. రామోజీ అనే పేరును ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. మీడియా, ఎంటర్‌టైన్మెంట్, రిటైల్, ఎడ్యుకేషన్, చిట్ ఫండ్స్ ఇలా అనేక వ్యాపార సంస్థలు స్థాపించారు. విజయంతంగా నడిపించడంతో పాటు సినిమాలనూ నిర్మించారు.
ఈనాడు న్యూస్‌పేపర్, ఈటీవీ (ఈనాడు టెలివిజన్) నెట్‌వర్క్‌తో పాటు ఉషాకిరణ్ మూవీస్, ఈటీవీ భారత్ చాలా పాపులర్. ఈనాడు పత్రిక మొదటి శాఖను 1974లో విశాఖలో ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఈనాడు టెలివిజన్ నెట్‌వర్క్ కూడా అప్రతిహతంగా నడుస్తోంది. తెలుగు, బంగ్లా, మరాఠి, కన్నడ, ఒడియా, గుజరాతీ, ఉర్దూ, హిందీ ఇలా ఎనిమిది భాషల్లో ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన 12 ఛానెళ్లు ఎంతో ఫేమస్. ఇక, దేశంలోని 24 రాష్ట్రాల్లో 13 భాషల్లో ఈటీవీ భారత్ డిజిటల్ న్యూస్ వెబ్ పోర్టల్, యాప్ ద్వారా సేవలందిస్తోంది.
ఇక ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వేర్వేరు భాషల్లో 80 సినిమాలను రామోజీరావు నిర్మించారు. అనేక మందిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ నటీనటులు, డైరెక్టర్లలో చాలా మంది ఆయన ప్రోత్సాహంతో పైకి వచ్చిన వారే. ఈ విషయాన్ని వారే స్వయంగా అనేక సార్లు మీడియాముఖంగా చెప్పుకొన్నారు. ఉత్తమ సినిమాలు నిర్మించి నాలుగు ఫిలిం ఫేర్, ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 2000లో తరుణ్-రిచా పల్లాడ్ జంటగా నిర్మించిన నువ్వే కావాలి సినిమాకి నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.
2021 నాటికి రామోజీ రావు ఆస్తుల విలువ అధికారికంగా 4.5 బిలియన్ డాలర్లు అంటే 37,583 కోట్లుగా తెలుస్తోంది.
అయితే, ఒక్క రామోజీ ఫిలిం సిటీ దాదాపు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాని విలువే వేల కోట్లలో ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోని కోకాపేట భూముల విలువ ప్రకారం చూస్తే... రామోజీ ఫలిం సిటీ భూముల విలువే సుమారు లక్షా 20 వేల కోట్ల రూపాయలని అంచనాలు ఉన్నాయి.
మార్గదర్శి చిట్ ఫండ్స్‌తో పాటు సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి వ్యాపార సంస్థ కళాంజలి, ఆధునిక వస్త్రాలు విక్రయ సంస్థ బ్రిసా, పచ్చళ్లు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి వ్యాపార సంస్థ ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్, కొలోరమ ప్రింటర్స్, ప్రియా పచ్చళ్లు కూడా రామోజీ స్థాపించిన సంస్థలే.
కాగా, జగన్ ప్రభుత్వం గతంలో రూ.793 కోట్ల విలువైన మార్గదర్శి చిట్ ఫండ్ ఆస్తులను ఎటాచ్ చేసింది. దీనిపై రామోజీ రావు కుటుంబంతో పాటు మార్గదర్శి, ఈనాడు సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి.
వారసులు వీరే...
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో నవంబర్ 16, 1936లో వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్ ప్రభాకర్, చిన్న కుమారుడు సుమన్ ప్రభాకర్. కాగా, సుమన్ అనారోగ్యం 2012లో చనిపోయారు. సుమన్ బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్ర లేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు.
ఇక, రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ద కోడలు శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు.
రామోజీ రావు చిన్న కుమారుడు సుమన్ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటి మేనేజింగ్ డైరెక్టర్. అలాగే, రామోజీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
ఇకపోతే, రామోజీ రావు పెద్ద కుమారుడు కిరణ్-శైలజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, వారికి వివాహమైంది. కిరణ్ రెండో కూతురు బృహతి ఈటీవీ భారత్ డైరెక్టర్.
రామోజీరావు రెండో కుమారుడు సుమన్- విజయేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సుమన్ కుమార్తె కీర్తి సోహనకు 2019లో వివాహమైంది.