Asianet News TeluguAsianet News Telugu

డీకే అరుణ విందు, రేవంత్ తో దోస్తీ: జైపాల్ రెడ్డికి చెక్

అరుణ హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ నేతలు కె. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

DK Aruna pitches for Mahaboobnagar seat
Author
Hyderabad, First Published Jan 18, 2019, 1:35 PM IST

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా మాజీ రాష్ట్ర మంత్రి, కాంగ్రెసు నేత డికె అరుణ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల పార్టీ సీనియర్ నేతలను విందు సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం.

అరుణ హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ నేతలు కె. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్ నేతలు లోకసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. 

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు లోకసభ స్థానాలున్నాయి. వీటిలో నాగర్ కర్నూల్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈ సీటు నుంచి గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. ఆయన స్థానికేతరుడు. ఇప్పుడు ఆ సీటుపై మల్లు రవి, సంపత్ కుమార్ తదితరులు కన్నేశారు. అయితే, మల్లు రవికి వ్యతిరేకంగా కూడా డీకె అరుణ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, మహబూబ్ నగర్ సీటు నుంచి మళ్లీ పోటీ చేయడానికి జైపాల్ రెడ్డి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిపై ఓడిపోయారు. ఈసారి ఆ సీటుపై డికె అరుణతో పాటు రేవంత్ రెడ్డి కూడా కన్నేసినట్లు చెబుతున్నారు. అయితే, రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి, జైపాల్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా మహబూబ్ నగర్ టికెట్ సాధించాలనే పట్టుదలతో డీకె అరుణ ఉన్నట్లు చెబుతున్నారు. 

శాసనసభ ఎన్నికల్లో డీకె అరుణ, జైపాల్ రెడ్డి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నారాయణపేట స్థానాన్ని శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని అరుణ పట్టుబట్టారు. అయితే, చివరకు జైపాల్ రెడ్డి అనుచరుడు సరాఫ్ కృష్ణకు టికెట్ దక్కింది. జైపాల్ రెడ్డి వల్ల వర్గవిభేదాలు చోటు చేసుకుని పార్టీకి నష్టం జరుగుతోందనే సంకేతాలను అరుణ అధిష్టానానికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అవసరమైతే పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి కూడా తాను సిద్ధమేనని అరుణ చెప్పినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios