గద్వాల: గద్వాల నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావంలో కాంగ్రెస్ నేత డీకే అరుణ నిప్పలు చెరిగారు. కేసీఆర్ పాలమూరు సెంటిమెంట్ తో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష చెయ్యలేదన్నారు. తెలంగాణలో బలిదానాలు ఆపాలనే నిర్ణయంతో 2009లో తెలంగాన రాష్ట్ర ప్రకటన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని తెలిపారు. ఆర్డీఎస్ కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని తెలిపారు.  

మరోవైపు కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ వాడుతున్న పదజాలం అసభ్యకరంగా ఉందన్నారు. అడ్డమైన బాష నేర్చుకునేందుకేనా కేటీఆర్ అమెరికా వెళ్లావ్ అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ కు ఓసారి ఓటు వేసి రుణం తీర్చుకున్నారని ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. 

అటు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం అంటూ హడావిడి చేశారని డీకే అరుణ ఆరోపించారు. ఎవరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో దమ్ముంటే ప్రోవిజనల్ చూపించాలని సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణానికి స్థలం ఉన్నా కూడా నిర్మాణం చేపట్టలేని సన్నాసులు టీఆర్ఎస్ నేతలంటూ మండిపడ్డారు.