తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ఊపుమీదికొచ్చినట్లు కనబడుతున్నది. ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలంతా పార్టీలోకి చేరుతున్న తరుణంలో ఆ పార్టీని మరింత జోష్ నింపేందుకు నాయకులు ప్రయత్నాలు షురూ చేశారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వాతావరణం ఉన్నది. అందుకే పార్టీలో ఒక విషయంలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. తాజాగా గద్వాల డికె అరుణ కూడా రేస్ లోకి వచ్చారు. ఇంతకూ ఏం పోటీ.. ఏం కథ అనుకుంటున్నారా? చదవండి మరి.

తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్రల లొల్లి రాజుకుంటున్నది. నేను పాదయాత్ర చేస్తానంటే.. నేను పాదయాత్ర చేస్తానంటూ పార్టీ లీడర్లు పోటీ పడుతున్నారు. ఏ ఒక్కరో పాదయాత్ర చేస్తే ఎక్కడ క్రెడిట్ అంతా వాళ్లే కొట్టేస్తారన్న ఉద్దేశంతో ఎవరు పాదయాత్ర చేసినా సమ్మతమే అని పార్ట అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పోటీయాత్రలకు నేతలు సిద్దమవుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఆలంపూర్ టూ ఆదిలాబాద్ పాదయాత్ర కు సిద్ధమవుతుతున్నారు మాజీ మంత్రి డీకే అరుణ. ఇప్పటికే తాను జరపతలపెట్టిన పాదయాత్ర పై ఎఐసిసి ఇన్ఛార్జి కుంతియాతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాను చేపట్టనున్న పాదయాత్రకు అనుమతినివ్వాలని అధిష్టానాన్ని కోరారు. మహిళా నేతగా పాదయాత్ర చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మంచి గుర్తింపు వస్తుందని కుంతియా కు అరుణ వివరించారు. ఇక పాదయాత్రకు రెడీ అవుతున్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలకు అనుమతి ఇస్తే తనకు కూడా అనుమతి ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరినట్లు చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనా కాలంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఆ సమయంలో మూడోసారి అంటే 2004లో అప్పటి సిఎల్పీ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారు. చేవెళ్ల నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు ఆయన యాత్ర సాగింది. యాత్రలో ఆయనకు జనాలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే అధికార టిడిపి పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కారణంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ చేసిన పాదయాత్ర కొత్త ఊపు తెచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ లో డజన్ల కొద్ది కాకలు తీరిన నేతలు ఉన్నప్పటికీ కేవలం పాదయాత్ర కారణంగానే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో వైఎస్ తిరుగులేని నేతగా నిలిచారు. తర్వాత మరోసారి అధికారంలోకి రావడం.. ఆయన హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించడం అన్నీ జరిగిపోయాయి. పాదయాత్ర పవర్ ఎంతగా ఉంటుందో రుచి చూసిన నేటి తరం నేతలంతా తామూ పాదయాత్ర చేసి బలం పెంచుకోవాలన్న తహతహలో ఉన్నారు. ఎపిలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు తండ్రి మాదిరిగానే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ కు బాగానే జనాలు కదులుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరు పాదయాత్ర చేస్తే.. వారే పార్టీలో బలవంతులుగా  నేతగా చెలామణి అవుతారన్న ఉద్దేశంతో చాలా మంది పాదయాత్ర లు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు కూడా సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆయనకు పాదయాత్ర కలిసొచ్చి నవ్యాంధ్రకు సిఎం అయ్యారు. ఇక వైఎస్ కుమార్తె షర్మిల కూడా పాదయాత్ర చేపట్టారు. కానీ ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రల హిస్టరీ ఒకసారి కదిలిస్తే.. గత కొంత కాలంగా తాను పాదయాత్ర చేయాలని తపించిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయనే కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాదయాత్ర చేస్తామని అధిష్టానం వద్ద రిక్వెస్టు పెట్టారు. తమకు పిసిసి ఇవ్వాలని, పాదయాత్రకు అనుమతివ్వాలని కోరారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆటలు అధిష్టానం వద్ద సాగలేదు. వారిద్దరూ టిఆర్ఎస్ తో లోపాయికారిగా టచ్ లో ఉన్నారన్న ఉద్దేశంతోనే వారి పాదయాత్రకు అనుమతి రాలేదని కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు నేతలు పాదయాత్రకు రెడీ అవుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. వారితోపాటు ఇప్పుడు తానూ రేస్ లో ఉన్నానంటూ డికె అరుణ కూడా వచ్చారు. మరి ముగ్గురికే కాక ఈమెకు కూడా పాదయాత్ర చేయడానికి అనుమతిస్తారా? లేదా అన్నది చూడాలి. మరి వీళ్లందరికీ ఇస్తే.. తాను ముందునుంచీ అడుగుతున్నాను కాబట్టి తనకు కూడా ఇవ్వాలని కోమటిరెడ్డి కూడా సీన్ లోకి వచ్చే చాన్స్ ఉంటుంది. మరి ఇంతమంది లీడర్లు పాదయాత్ర చేస్తే మంది ఎక్కువైతే.. మజ్జిగ పల్చన అన్నట్లు సీన్ మారిపోతుందా అనేది చూడాల్సిన ముచ్చట.