పెద్దపల్లి జిల్లా మంథని టికెట్ ఈసారి పుట్టా మధుకు ఇస్తే సహకరించేది లేదని అసమ్మతి నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి తేల్చి చెప్పారు. మంథని, కాటారం, ముత్తారం ఇలా పలు మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు మధుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో రెండ్రోజులుగా పుట్టా మధు సమావేశమవుతున్నారు. నిన్నటి సమావేశానికి సామాజికవేత్త కదరే కృష్ణ హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో పార్టీ సంబంధిత ఫ్లెక్సీ ఏది కనిపించలేదు. ఇవాళ మరోసారి అదే ఫంక్షన్ హాల్‌లో పుట్టా మధు సమావేశం ఏర్పాటు చేశారు. దానికి మాత్రం మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
ఇదిలావుంటే పుట్టా మధుకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అసమ్మతి రాజుకుంది. మధుకు టికెట్ ఇవ్వొద్దని బాహాటంగానే విమర్శలు, విన్నపాలు వస్తున్నాయి. మంథని, కాటారం, ముత్తారం ఇలా పలు మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు మధుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. పుట్టా మధు బీఆర్ఎస్ ఎజెండాతో కాకుండా బహుజన ఎజెండాతో వెళ్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈసారి ఆయనకు మంథని టికెట్ ఇవ్వొద్దని.. ఇస్తే సహకరించేది లేదని అధిష్టానానికి అల్టీమేటం జారీ చేశారు. మధు పార్టీ లైన్‌లో కాకుండా వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారనేది వారి వాదన.
